9ఏళ్ల తెలంగాణపై పోస్టల్ కవర్ రిలీజ్.. ప్రతి ఇంటికి పోస్టల్ తో అనుబంధం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా అబిడ్స్ లోని జీపీఓలో తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రత్యేక కవర్ ను రూపొందించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ లో విడుదల చేశారు.
బౌద్ధ వారసత్వ ప్రాంతమైన భావపూర్ కుర్రుకు సంబంధించిన పోస్ట్ కార్డుల సెట్ ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
తపాలా సిబ్బంది సేవలను ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు.దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ పౌర సేవలు అందించేలా తపాలా ఆఫీసులను కేంద్రం తీర్చిదిద్దుతోందని మంత్రి తెలిపారు.
భారతీయ పోస్టల్ వ్యవస్థను ఆధునికీకరించామన్నారు. తపాలా సేవలకు తోడుగా పాస్ పోర్ట్, ఆధార్, బ్యాంకింగ్ వంటి సేవలను తపాలా విభాగానికి విస్తరించామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
DETAILS
ప్రతి ఇంటికి పోస్టల్ తరఫున ఏదో ఒక అనుబంధం : కిషన్ రెడ్డి
తెలంగాణలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానించామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు రూ. 26 వేల కోట్లతో ప్రాజెక్ట్ వస్తోందని, ఇవన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగుల వల్లే వస్తున్నాయన్నారు.
ప్రతి ఇంటితో పోస్టల్ శాఖకు ఏదో ఒక రకంగా అనుబంధం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. పోస్టుఫీస్ సేవలను దేశ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కిషన్ రెడ్డి కోరారు.
ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూస్తోందన్నారు. ఈ మేరకు భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందన్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం లేకుండా దేశంలో ఏ కార్యక్రమమూ జరగదని, పాలకులకు తగ్గ రీతిలో ఉద్యోగులు కూడా అదే మాదిరిగా పని చేస్తారన్నారు.