Kolkata Horror: కోల్‌కాతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారు.. కోర్టుకు తెలిపిన సీబీఐ
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
తాలా పోలీస్ స్టేషన్‌లో తప్పుడు రికార్డులు సృష్టించినట్లు సీబీఐ ఆరోపించింది. తాలా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అభిజిత్ మండల్, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ను కస్టడీలో విచారించిన తర్వాత సీబీఐ, తమ దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని స్పెషల్ కోర్టుకు తెలియజేసింది.
ఈ కేసుకు సంబంధించి కొన్ని తప్పుడు రికార్డులు తాలా పోలీస్ స్టేషన్‌లో తయారు చేసినట్లు గుర్తించినట్లు పేర్కొంది.
సెప్టెంబరు 14న అభిజిత్ మండల్‌ను అరెస్టు చేయగా, కోర్టు ఆదేశాల ప్రకారం, సందీప్ ఘోష్‌ను సెప్టెంబర్ 15వ తేదీన అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.
వివరాలు
స్పెషల్ కోర్టులో సీల్డ్ కవర్ నివేదికను సమర్పించిన సీబీఐ అధికారులు
మరొకవైపు, అభిజిత్ మండల్,సందీప్ ఘోష్ తరపు న్యాయవాదులు కోర్టులో అభియోగాలు మోపడానికి బదులుగా సాక్ష్యాలను సమర్పించాలనుకున్నారు.
హత్యాచారం జరిగిన తరువాత ఆసుపత్రి అధికారి (ఘోష్)ఇన్‌ఛార్జ్ అధికారితో మాట్లాడడం సహజమని వారు తెలిపారు.
మాజీ పోలీస్ అధికారి తరపు న్యాయవాది అయాన్ భట్టాచార్య ఈ కేసులో తన క్లైంట్ (మండల్) కు ప్రమేయం లేదని వాదించారు.
అలాగే, సీల్డ్ కవర్‌ను కోర్టు పరిగణించకుండా ఉండాలని సందీప్ ఘోష్ తరపు న్యాయవాది జోహైబ్ రవూఫ్ అభ్యర్థించారు.
సీబీఐ అధికారులు స్పెషల్ కోర్టుకు సీల్డ్ కవర్ నివేదికను సమర్పించారు.నిందితులిద్దరికి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరింది.
కోర్టు సీబీఐ వాదనలను అంగీకరించి,ఇద్దరికీ ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీ విధించింది.