
Konda Laxma Reddy: చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి కన్నుమూత
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి ఈ ఉదయం కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని హైదర్‌గూడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో, ఈ రోజు ఉదయం 5:30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహించనుందని కుటుంబం తెలియజేసింది. కొండా లక్ష్మారెడ్డికి రాజకీయాల్లో గొప్ప నేపథ్యం ఉంది. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డికి స్వయానా మనవడు. తాత భావనలు, ఆశయాలను తన రాజకీయ జీవితంలో మార్గదర్శకంగా తీసుకుని, లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
వివరాలు
జర్నలిజం రంగంలోనూ ఆయనకు ప్రత్యేక ఆసక్తి
ఆయన ఏపీసీసీ ప్రతినిధి, గ్రీవెన్స్ సెల్ చైర్మన్ గా సేవలందించారు. అంతేకాకుండా, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ క్రీడా మండలి చైర్మన్ గా కూడా పనిచేశారు. 1999,2014 ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి పోటీ చేశారు. రాజకీయ జీవితంతో పాటు జర్నలిజం రంగంలోనూ ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉండేది. ఈ మక్కువను దృష్టిలో పెట్టుకుని, 1980లో ఆయన 'ఎన్ఎస్ఎస్' (NSS) పేరుతో ఒక స్థానిక వార్తా సంస్థను స్థాపించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కూడా ఆయన అనేక కృషి చేశారు. ఆయన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ,హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి,జర్నలిజం రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంతరించుకున్నారు. కొండా లక్ష్మారెడ్డి మృతి పట్ల అనేక రాజకీయ,జర్నలిస్టు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.