Kotipalli-Narsapur Railway Line: మళ్లీ పట్టాలు ఎక్కిన రైల్వే లైన్ పనులు.. కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం..
ఈ వార్తాకథనం ఏంటి
అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఆశగా ఎదురుచూస్తున్న కోటిపల్లి - నర్సాపురం రైల్వే లైన్ పనులకు మోక్షం లభించింది.
రైల్వే లైన్ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో నిర్మాణం చేపట్టేలా సంబంధిత చర్యలు ప్రారంభించారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ రైల్వే అధికారులను ఆదేశించడంతో పనులు మళ్లీ పట్టాలు ఎక్కాయి.
గతంలో రైల్వే లైన్ నిర్మాణం కోసం భూ సేకరణ పూర్తయిన ప్రాంతాలలో రైల్వే అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు.
ఆ భూముల్లో రైల్వే నిర్మాణ పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకున్నారు.
వివరాలు
రైల్వే అధికారులను ఆదేశాలు ఇచ్చిన జిల్లా కలెక్టర్..
అయినవిల్లి మండలంలోని శానపల్లి లంక, సిరిపల్లి, మాగం, అలాగే అమలాపురం రూరల్ మండలంలోని ఏ. వేమవరం, బట్నవిల్లి గ్రామాల్లో రైల్వే లైన్‌కు అవసరమైన భూసేకరణ పూర్తయింది.
రైల్వే అధికారులు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపి నిర్మాణ పనులను ప్రారంభించారు.
రెవెన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో భూసేకరణ పూర్తయిన భూములను సర్వే చేసి, హద్దులను గుర్తించి, రైల్వే అధికారులకు అప్పగిస్తున్నారు.
సంబంధిత ప్రాంతాల్లో రైతులు తదుపరి పంట వేయకముందే, భూసేకరణ పూర్తయిన భూములను రైల్వే అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని పనులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.