KCR to Assembly: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ అధినేత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొనబోతున్నారని, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు.
అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ హాజరవుతారని, అలాగే బడ్జెట్ ప్రసంగంలో కూడా ఆయన పాల్గొంటారని కేటీఆర్ తెలిపారు.
ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్ మీడియాతో ముచ్చటించారు.
మార్చి 12న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ వెల్లడించారు.
అంతేకాదు, ఆ తరువాత మరికొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొననున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్లీనరీ సమావేశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: కేటీఆర్
అయితే, వ్యక్తిగతంగా తాను ఒక కొడుకుగా చూస్తే, అసెంబ్లీలో కేసీఆర్ హాజరు కాకపోవడమే మంచిదని భావిస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్‌లో కేసీఆర్ స్థాయికి సరిపోగల నాయకుడు లేడని, వారి విమర్శలు, అవాస్తవ ఆరోపణలు విన్నప్పుడు అర్ధంలేనివిగా అనిపిస్తాయని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్ నిర్వహించబోయే భారీ బహిరంగ సభ కోసం వరంగల్‌ను అనుకూల ప్రదేశంగా ఎంపిక చేశామని కేటీఆర్ తెలిపారు.
రవాణా వంటి అన్ని సౌకర్యాలు అక్కడ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్లీనరీ సమావేశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే త్వరలోనే కేసీఆర్ నిర్ణయం ప్రకటిస్తారని వివరించారు.
వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు సభలు నిర్వహించడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని భావించినట్లు తెలియజేశారు.