
Kunal Kamra: పోలీసుల నోటీసులతో.. షో కారణంగా అసౌకర్యానికి గురైన ప్రేక్షకులకు కునాల్ కమ్రా క్షమాపణలు
ఈ వార్తాకథనం ఏంటి
స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లు కనిపిస్తోంది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శివసేనను చీల్చిన "ద్రోహి" అంటూ ఆయన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల కారణంగా కునాల్ కమ్రా సమస్యల్లో పడిపోయారు.
మహారాష్ట్రలోని పలు పోలీస్ స్టేషన్లలో శివసేన కార్యకర్తలు ఆయనపై ఫిర్యాదులు చేశారు.
దీంతో ముంబై పోలీసులు కునాల్ కమ్రాకు సమన్లు జారీ చేశారు. అయితే, కునాల్ కమ్రా ఈ విషయంలో ఎలాంటి స్పందన తెలియజేయలేదు.
ఈ నేపథ్యంలో, మద్రాస్ హైకోర్టు కునాల్ కమ్రాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన పుదుచ్చేరిలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
బ్యాంకర్‌కు ముంబై పోలీసులు సమన్లు
ఇదిలా ఉంటే,ఇటీవల కునాల్ కమ్రా షోకు హాజరైన ఒక బ్యాంకర్‌కు ముంబై పోలీసులు సమన్లు పంపించారు.
దీని కారణంగా ఆయన తన కేరళ,తమిళనాడు పర్యటనలను వాయిదా వేసుకుని విచారణకు హాజరయ్యారు.
ఈ విషయాన్ని ఆయన "ఎక్స్" ద్వారా వెల్లడించారు."నేను మార్చి 21న ముంబై నుంచి బయలుదేరి, ఏప్రిల్ 6న తిరిగి రావాల్సి ఉంది. కానీ, తమిళనాడులో ఉన్నప్పుడు ముంబై పోలీసులు పదేపదే ఫోన్ చేయడంతో వెంటనే తిరిగి రావాల్సి వచ్చింది. ఫోన్ చేసిన అధికారి బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. నా ప్రయాణంపై అనుమానంతో ఇంట్లో తనిఖీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో నా సెలవు ముందుగానే ముగించుకుని ముంబైకి తిరిగి రావాల్సి వచ్చింది" అని బ్యాంకర్ సోషల్ మీడియాలో వాపోయారు.
వివరాలు
బ్యాంకర్‌కి కొత్త ప్రయాణ ఏర్పాట్లు
అలాగే, "కునాల్ కమ్రా షో కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కానీ, పోలీసులు నా మీద కునాల్ వీడియోను ఎడిట్ చేశానని ఆరోపిస్తున్నారు. షో వీడియోను నాకు ఎందుకు (ఎడిటింగ్ కోసం) అప్పగిస్తారు?" అని ఆయన ప్రశ్నించారు.
కునాల్ కమ్రా తన షో వల్ల అసౌకర్యానికి గురైన ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు.
విచారణ అనంతరం బ్యాంకర్‌కి కొత్త ప్రయాణ ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.
"మీరు నాకు మెయిల్ చేయండి, నేను దేశంలోని ఎక్కడికైనా మీకు కొత్త టికెట్లు బుక్ చేసి పంపిస్తాను" అని తెలిపారు.
వివరాలు
అవసరమైనప్పుడు స్టేట్‌మెంట్ తీసుకుంటాం
ఇదిలా ఉంటే, ప్రేక్షకులకు నోటీసులు ఇచ్చినట్లు వస్తున్న వార్తలను ముంబై పోలీసులు ఖండించారు.
తాము ఎవరికి నోటీసులు ఇవ్వలేదని, కేవలం బ్యాంకర్‌ను సాక్షిగా పిలిచామని స్పష్టం చేశారు.
"దర్యాప్తు అధికారి బ్యాంకర్‌కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌కు రావాలని మాత్రమే చెప్పారు. అనంతరం, కొన్ని పరిణామాల తర్వాత మళ్లీ ఫోన్ చేసి, వెంటనే హాజరయ్యే అవసరం లేదని తెలిపారు. అవసరమైనప్పుడు మళ్లీ కాల్ చేసి స్టేట్‌మెంట్ తీసుకుంటాం" అని ముంబై పోలీసులు తెలిపారు.