AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య.. పిస్టల్‌తో కాల్చుకుని మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఉద్యోగాల్లో స్థిరపడే వారు కొందరే కాగా, మరికొందరు సరైన అవకాశాలు దొరకక ఇబ్బందులు, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుల కోసం వెళ్లిన కర్నూలు జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులను షాక్‌కు గురిచేసిన ఈ ఘటన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కర్నూలుకు చెందిన చందు అనే యువకుడు అమెరికాలోని చికాగో నగరంలో ఎంఎస్ పూర్తి చేశాడు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ అవకాశాలు దొరకకపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు సమాచారం.
వివరాలు
శోక సముద్రంలో కుటుంబ సభ్యులు
ఈ క్రమంలో ఈ నెల 28వ తేదీన చందు పిస్టల్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఆయన కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ తన కుమారుడిని చదివించిన తండ్రి ఆశలు ఒక్కసారిగా చిద్రమయ్యాయి. ఇక మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకొచ్చింది. అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి చందు మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఘటన విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, ఉద్యోగ అవకాశాల కొరత వంటి సమస్యలను మరోసారి గుర్తు చేస్తోంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు చందు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.