Anam Ramanarayana Reddy: లడ్డూ వివాదం.. టీటీడీ పాలకమండలి నియామకంపై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ పాలకమండలి నియామకంపైనా కూడా చర్చ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక కొత్త పాలకమండలి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామాలపై ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు
టీటీడీ బోర్డు నియామకం త్వరలో జరుగుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై కసరత్తు చేస్తున్నారని తెలిపారు. నూతన పాలకమండలిని త్వరలోనే నియమించి, దేవాలయాల నిర్వహణలో సరైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. లడ్డూ వివాదానికి సంబంధించిన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు దీనిపై డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో చర్చలు జరిపి, సాయంత్రంలోగా జీవో విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమస్య కారణంగా రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో, ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమాలు నిర్వహించామని మంత్రి వివరించారు. బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.