ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ
ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వాన్ని పార్లమెంట్ దిగువసభ బుధవారం పునరుద్ధరించింది. ఈ ఏడాది జనవరిలో హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీగా ఉన్న ఫైజల్‌ను సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో కోర్టు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఫైజల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. సెషన్స్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహ్మద్ ఫైజల్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కేరళ హైకోర్టు ఫైజల్ శిక్షపై స్టే విధించింది.
సుప్రీంకోర్టు విచారణకు ముందే లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు
హత్యాయత్నం కేసులో పడిన శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించిందని, రద్దు చేసిన తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని ఫైజల్ మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టక ముందే ఫైజల్‌పై అనర్హుత వేటును రద్దు చేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. మహ్మద్ సలీహ్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో కవరత్తిలోని సెషన్స్ కోర్టు ఫైజల్‌లో పాటు మరో ముగ్గురికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.