
Andhra Pradesh: అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు.. ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (GoM) సిఫార్సుల మేరకు ఇప్పటికే భూములు పొందిన ఆరుగురు లబ్ధిదారులకు కొన్ని సవరణలతో పాటు, కొత్తగా ఏడు సంస్థలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, కొత్తగా ఏడు సంస్థలకు మొత్తం 32.40 ఎకరాల భూమిని కేటాయించింది. అలాగే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యాలయానికి రెండు ఎకరాల భూమిని రాజధానిలో కేటాయించింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ భూములను 60 సంవత్సరాల లీజు ప్రాతిపదికన ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది.
Details
భూ కేటాయింపులు రద్దు
ఇదిలా ఉంటే, గెయిల్, అంబికా అనే సంస్థలకు గతంలో చేసిన భూ కేటాయింపులను ప్రభుత్వం రద్దు చేసింది. గెయిల్‌కు అప్పట్లో కేటాయించిన 0.40 సెంట్లు, అంబికాకు కేటాయించిన ఒక ఎకరా భూమిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు సంస్థలకూ భూముల వెనక్కి తీసుకునే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా సీఆర్డీఎ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల నేపథ్యంలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేశ్ కుమార్ తగిన అధికారిక ఆదేశాలను జారీ చేశారు. తాజా నిర్ణయాలతో అమరావతిలో భూ వినియోగ విధానంపై ప్రభుత్వం గణనీయమైన పునఃపరిశీలన చేపట్టినట్టుగా స్పష్టమవుతోంది.