Loksabha: ప్రతిపక్ష పార్టీల ఒత్తిడితో లోక్‌సభ నిరవధిక వాయిదా.. ఇంతకీ ఏం జరిగింది
ఈ వార్తాకథనం ఏంటి
లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అవమానపరిచారనే ఆరోపణలతో, శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
ప్రతిస్పందనగా ఎన్డీయే కూటమి నేతలు కూడా ప్లకార్డులతో ఆందోళనలో పాల్గొన్నారు.
ఈ ఘటనలపై అసంతృప్తిని వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
అదేవిధంగా జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
గౌతమ్ అదానీపై ఆరోపణలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్
నవంబర్ 25న ప్రారంభమైన ఈ శీతాకాల సమావేశాలు మొదటి వారంలో అనేక సార్లు వాయిదా పడటం గమనార్హం.
రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్యంపై చర్చలు, బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు దారితీశాయి.
సమావేశాల ప్రారంభంలోనే గౌతమ్ అదానీపై అమెరికా ఆరోపణలపై చర్చ జరగాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.
అయితే, చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి.
ఈ సెషన్‌లో 'ఒక దేశం, ఒకే ఎన్నిక' బిల్లుపై చర్చ కొనసాగింది. జమిలి ఎన్నికలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
వివరాలు
31 మంది ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ
రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్రం 31 మంది ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని (జేపీసీ) ఏర్పాటు చేసింది.
ఈ తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చివరిరోజు జమిలి ఎన్నికల బిల్లును జేపీసీకి పంపించడం జరిగింది.
ఇదే సమయంలో, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
ధన్‌ఖడ్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో ఈ తీర్మానాన్ని సమర్పించగా, 14 రోజుల నోటీసు లేకపోవడం, డ్రాఫ్టింగ్ లోపాలతో పాటు విధానపరమైన కారణాలతో ఈ తీర్మానాన్ని పక్కన పెట్టారు.