
AP Assembly: 2024-25 ఆర్థిక సర్వే వెల్లడి.. శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12.94% వృద్ధి సాధించనున్నట్లు అంచనా వేసింది.
వ్యవసాయ, అనుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అభివృద్ధి కారణంగా ఈ పురోగతి సాధ్యమవుతుందని విశ్లేషించింది.
మంచి వర్షపాతం కారణంగా ఆహారధాన్యాల ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే పెరిగింది.
రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పారిశ్రామిక, బ్యాంకింగ్, బీమా రంగాల్లో కూడా వృద్ధి కొనసాగుతోంది. మొత్తం మీద, రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.16.06 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఆర్థిక సర్వే అంచనా వేస్తోంది.
వివరాలు
ఆదాయం, అప్పులు, లోటు వివరాలు
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,68,653గా ఉంది, ఇది జాతీయ సగటు రూ.2,00,162 కంటే ఎక్కువ.
2024-25లో సొంత పన్నుల ద్వారా రూ.94,967 కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.7,018 కోట్లు, కేంద్ర బదలాయింపుల ద్వారా రూ.89,157 కోట్లు సమకూరినట్లు ఆర్థిక సర్వే తెలియజేసింది.
2023-24లో రాష్ట్ర వ్యయాలు రూ.2,36,512 కోట్లు కాగా, 2024-25లో అవి రూ.2,49,418 కోట్లకు పెరుగనున్నాయి.
2023-24 నాటికి రాష్ట్ర అప్పు రూ.4,91,734 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.5,64,488 కోట్లకు చేరనుంది.
రెవెన్యూ లోటు 2023-24లో రూ.38,683 కోట్లు కాగా, 2024-25లో ఇది రూ.48,311 కోట్లకు పెరగనుంది. ద్రవ్య లోటు రూ.62,720 కోట్ల నుంచి రూ.73,362 కోట్లకు పెరుగుతుందని అంచనా.
వివరాలు
సాగు,ఉత్పత్తి పురోగతి
జూన్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతం 860 మి.మీ.గా ఉంటే, 2024లో ఇది 960.3 మి.మీ.గా నమోదైంది.
ఇది 11.7% అదనపు వర్షపాతం. వర్షపాతం పెరిగిన కారణంగా ఆహార పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.
2023-24లో 33.24 లక్షల హెక్టార్లలో సాగు జరిగితే, 2024లో ఇది 37.51 లక్షల హెక్టార్లకు చేరుకుంది.
ఆహారధాన్యాల ఉత్పత్తి 143.31 లక్షల టన్నుల నుంచి 161.86 లక్షల టన్నులకు పెరిగింది.
వరి ఉత్పత్తి 127.15 లక్షల టన్నులుగా ఉండనుందని అంచనా, ఇది గత ఏడాదితో పోలిస్తే 12.95% అధికం. ఏపీ ప్రస్తుతం 18.23 లక్షల హెక్టార్లతో దేశంలోనే పండ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది.
వివరాలు
ప్రభుత్వ లక్ష్యాలు - రైతులకు మద్దతు
ప్రభుత్వం వడ్డీలేని రుణాలను అందుబాటులోకి తెచ్చింది. మౌలిక సదుపాయాల మెరుగుదల, రాయితీ ధరలకు విత్తనాల పంపిణీ, ఆధునిక వ్యవసాయ పరికరాల ప్రోత్సాహం వంటి చర్యలు చేపట్టింది.
2025 జనవరి నాటికి 9,13,283 మంది కౌలు రైతులకు ఈ-కార్డులు అందించగా, వారిలో 2 లక్షల మందికి రూ.2,848 కోట్ల రుణాలు మంజూరు చేసింది.
వివరాలు
ధరల స్థిరీకరణ, వేతనాల పెరుగుదల
ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి సారించింది. 2024-25లో ఉల్లిపాయల ధరలు 40.24% పెరగగా, ప్రభుత్వం నేరుగా రైతుల నుండి కొనుగోలు చేసి, సరఫరా నిర్వహించింది.
వ్యవసాయ కూలీల రోజువారీ వేతనం రూ.561గా పెరిగింది. పరిశ్రమల కార్మికుల వేతనాలు 4.89% పెరిగాయి.
మహిళా కూలీల సగటు వేతనం రూ.398కి చేరింది. వడ్రంగులు, స్వర్ణకారుల వేతనాల్లో వేగవంతమైన వృద్ధి కనిపించింది.
కార్పెంటర్ల రోజువారీ వేతనం 7.74% పెరిగి రూ.710కి చేరింది. ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రతను కల్పిస్తోంది. 1.48 కోట్ల మందికి రాయితీపై బియ్యం, ఇతర నిత్యావసరాలను అందిస్తోంది.
దీపం-2 పథకం కింద ఎల్‌పీజీ సిలిండర్లు పంపిణీ కొనసాగుతోంది.
వివరాలు
మొత్తం రాష్ట్ర ఆర్థిక పురోగతి
2024-25లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.16.06 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది.గతేడాదితో పోలిస్తే 12.94% వృద్ధి నమోదవుతుంది.
వ్యవసాయ,పారిశ్రామిక,సేవా రంగాల సమతుల అభివృద్ధి ఇందుకు కారణం.వ్యవసాయ రంగం రూ.5.19 లక్షల కోట్ల అదనపు విలువను జోడిస్తోంది.
సాగులో 15.86%, మత్స్య రంగంలో 16%వృద్ధి నమోదైంది.పారిశ్రామిక రంగం 6.71% వృద్ధి నమోదు చేయగా,తయారీ రంగంలో 6.57%అభివృద్ధి,నిర్మాణ రంగంలో 10.47% వృద్ధి కనిపిస్తోంది.
సేవల రంగం 11.70%వృద్ధితో రూ.6.11లక్షల కోట్ల స్థూల అదనపు విలువను జోడించనుంది.
కమ్యూనికేషన్ రంగం 15.28%వృద్ధిని సాధించగా,బ్యాంకింగ్,బీమా రంగాలు 14.61% వృద్ధి నమోదు చేశాయి.
మొత్తం మీద,రాష్ట్ర ఆర్థిక స్థితి గణనీయంగా అభివృద్ధి చెందుతోంది.ప్రభుత్వం చేపడుతున్న విధానాలు,పెట్టుబడులు,వ్యవసాయానికి అందిస్తున్న మద్దతు ద్వారా మరింత స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.