LOADING...
Latha Rajinikanth: కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్‌ సరికొత్త అడుగు
కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్‌ సరికొత్త అడుగు

Latha Rajinikanth: కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్‌ సరికొత్త అడుగు

వ్రాసిన వారు Moogati Shabari
Jul 04, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రయాణాన్ని ఎక్కువకాలం కొనసాగించకుండా వెనక్కి తగ్గారు. భవిష్యత్తులో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది స్పష్టత లేకపోయినా, సమాజానికి సేవ చేసే కొత్త తరం నాయకులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన సతీమణి లతా రజనీకాంత్‌ ముందడుగు వేస్తున్నారు. గాయని, సినీ నిర్మాత, విద్యావేత్త, సామాజిక సేవకురాలిగా గుర్తింపు పొందిన లతా రజనీకాంత్‌ ఇటీవల 'మక్కళ్‌ మేడై (ప్రజా వేదిక)' అనే సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ప్రజలకు అండగా నిలిచే సేవాభావం కలిగిన కార్యకర్తలను తయారుచేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. అలాగే ప్రజల్లో రాజకీయ అవగాహన పెంపొందించడం, హక్కుల సాధనపై చైతన్యం కల్పించడం వంటి కార్యక్రమాలను ఈ వేదిక నిర్వహిస్తోంది.

వివరాలు

ప్రతి వీధిలో 'కేర్‌టేకర్‌'లను నియమించే ప్రక్రియ..

ఈ లక్ష్యాలను సాధించేందుకు ప్రతి గ్రామం, ప్రతి వీధిలో 'కేర్‌టేకర్‌'లను నియమించే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలులోకి వచ్చింది. స్థానిక ప్రజల సమస్యలు, అవసరాలు, పరిస్థితులపై అవగాహన కలిగిన వారినే కేర్‌టేకర్‌లుగా ఎంపిక చేస్తున్నారు. వారు స్థానిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ప్రజా అవసరాల పరిష్కారానికి కృషి చేస్తారు. భవిష్యత్తులో వీరినే ప్రజలకు సేవ చేసే నాయకులుగా తీర్చిదిద్దేందుకు సంస్థ కార్యాచరణ రూపొందిస్తోంది. ముఖ్యంగా భావితరాల సంక్షేమం, అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. విరుదునగర్‌ జిల్లాలో బాణసంచా పరిశ్రమలో జరిగిన పేలుళ్లలో మృతిచెందిన కుటుంబాల్లోని తొమ్మిది మంది చిన్నారులు అనాథలయ్యారు. ఈ చిన్నారులను 'మక్కళ్‌ మేడై' ప్రతినిధులు తమ సంరక్షణలోకి తీసుకుని వారికి అండగా నిలిచారు.

వివరాలు

ప్రజా సేవకులకు తగిన గుర్తింపు తీసుకొస్తాం: లతా రజనీకాంత్

'ప్రస్తుతం మా సంస్థ పూర్తిగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది. ప్రజాసేవలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని మేము విశ్వసిస్తున్నాం. అందుకే ప్రజలలో నుంచే సేవాభావం కలిగిన నాయకత్వాన్ని వెలికితీసి, వారికి సమాజంలో ఆదరణ లభించేలా కార్యాచరణ రూపొందించాం. ఈ సంస్థను రాజకీయాల్లో ప్రవేశించాలనే ఉద్దేశంతో స్థాపించలేదు. ఇందులో జరిగే అన్ని కార్యక్రమాలకు నేను పర్యవేక్షకురాలిగా మాత్రమే వ్యవహరిస్తాను. ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వేదికలో చోటు ఉంటుంది' అని లతా రజనీకాంత్ తెలిపారు.

Advertisement