LOADING...
Supreme Court: సుప్రీం కోర్టులో షాకింగ్‌ ఘటన.. సీజేఐపై దాడికి యత్నం
సుప్రీం కోర్టులో షాకింగ్‌ ఘటన.. సీజేఐపై దాడికి యత్నం

Supreme Court: సుప్రీం కోర్టులో షాకింగ్‌ ఘటన.. సీజేఐపై దాడికి యత్నం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 06, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టులో సోమవారం చోటుచేసుకున్న సంఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై ఒక న్యాయవాది దాడి చేయడానికి యత్నించాడు. ఈ దృశ్యం గమనించిన తోటి లాయర్లు వెంటనే స్పందించి, అతన్ని ఆపి పోలీసులకు అప్పగించారు. ఇటీవ‌లే ఖజురాహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో ధ్వంసమైన విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సీజేఐ బీఆర్‌ గవాయ్‌ తిరస్కరించారు. అయితే ఆ తీర్పు సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

వివరాలు 

సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం మౌనం వహించదు

ఈ నేపథ్యంలో,ఇవాళ సుప్రీం కోర్టులో మరో కేసు విచారణ జరుగుతుండగా, ఒక లాయర్‌ అకస్మాత్తుగా ప్రధాన న్యాయమూర్తిపై షూ విసరడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు ఆ షూ సీజేఐ బెంచ్‌ వద్దకు చేరక ముందే నేలపై పడిపోయింది. అదే సమయంలో ఆ లాయర్‌ "సనాతన ధర్మాన్ని అవమానిస్తే దేశం మౌనం వహించదు" అంటూ నినాదాలు చేశాడు. అయితే అక్కడి ఇతర లాయర్లు వెంటనే అతన్ని అడ్డుకుని కోర్టు సిబ్బందికి అప్పగించారు. ఈ ఘటనతో క్షణం పాటు కోర్టులో ఉద్రిక్తత నెలకొన్నా,జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ చాలా ధైర్యంగా వ్యవహరించారు.

వివరాలు 

 జవారీ ఆలయంలో ధ్వంసమైన ఏడు అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం 

"ఇలాంటి చర్యలు నన్ను ఏ విధంగానూ ప్రభావితం చేయవు. వాదనలు కొనసాగించండి"అంటూ కేసు వాదిస్తున్న లాయర్లకు సూచించారు. దాడి చేసిన వ్యక్తి పేరు కిషోర్‌ దాస్‌గా గుర్తించబడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని,దాడి వెనుక ఉన్న కారణాలపై విచారణ ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌ జిల్లాలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ప్రసిద్ధ ఖజురాహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణుమూర్తి విగ్రహం కొంతకాలం క్రితం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్తదాన్ని ప్రతిష్ఠించాలని కోరుతూ రాకేశ్‌ దలాల్‌ అనే వ్యక్తి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేశారు.ఈ పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కె. వినోద్‌ చంద్రన్‌ ధర్మాసనం పరిశీలించింది.

వివరాలు 

పబ్లిసిటీ కోసం దాఖలైన కేసు

సెప్టెంబర్‌ 17న జరిగిన విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్‌ మాట్లాడుతూ, "ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు, పబ్లిసిటీ కోసం దాఖలైన కేసు. ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము. ఆలయం భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ) పరిధిలో ఉంది. కావున వారినే సంప్రదించండి. లేకపోతే మీరు విష్ణుమూర్తికి భక్తుడినని చెబుతున్నారుగా, ఆయనను ప్రార్థించండి. శైవమతానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురాహోలో అతిపెద్ద శివలింగం ఉంది, అక్కడ కూడా మీరు విన్నపం చేయవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్నిర్మాణంపై తుది నిర్ణయం ఏఎస్‌ఐదే" అని వ్యాఖ్యానించారు.

వివరాలు 

సోషల్‌ మీడియా అనేది కళ్లెం లేని గుర్రం

అయితే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఒక వర్గం ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా మాట్లాడారని విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు నెటిజన్లు ఆయనను అభిశంసించాలని కూడా డిమాండ్‌ చేశారు. దీని నేపథ్యంలో, సెప్టెంబర్‌ 18న మరో కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ, "నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నా వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో తప్పుగా ప్రచారం అయ్యాయి" అని స్పష్టంచేశారు. ఆ సమయంలో కోర్టులో ఉన్న సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, సీనియర్‌ అడ్వకేట్‌ కపిల్‌ సిబల్‌ కూడా గవాయ్‌కు మద్దతుగా మాట్లాడుతూ, సోషల్‌ మీడియా అనేది కళ్లెం లేని గుర్రంలాంటిదని, దానిని అదుపు చేయడం కష్టమని వ్యాఖ్యానించారు.