
CBN Collectors Meeting: రేషన్, గంజాయి, డ్రగ్స్ మాఫియాలను కూకటి వేళ్లతో పెకిలించాలి.. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానంతరం రాష్ట్ర పునరుద్ధరణ కోసం అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి సంక్షోభంలో అవకాశాలను వెతకడం నాయకత్వ లక్షణమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ఇటీవల ఐటీ మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో గూగుల్ సంస్థను రాష్ట్రానికి ఆహ్వానించడానికి చేసిన ప్రయత్నం ఫలితంగా విశాఖపట్నంలో ఆ సంస్థ క్యాంపస్ ఏర్పాటుకు ముందుకొచ్చిందని తెలిపారు.
ప్రస్తుత సాంకేతిక ప్రగతిలో డీప్ టెక్ ముఖ్యమైనదని, గూగుల్ లాంటి సంస్థలు వస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని, డేటా సెంటర్‌లు,ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో అభివృద్ధితో ఏపీ ఒక మార్గదర్శక రాష్ట్రంగా మారుతుందని అన్నారు.
నాలెడ్జి ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో కార్యాచరణలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
మాఫియాను అరికట్టేందుకు కలెక్టర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలి
ఆర్టీజీఎస్ ద్వారా గూగుల్ సహకారంతో పౌర సేవలను సులభతరం చేస్తున్నామని, ఇప్పటివరకు అభివృద్ధి క్రమంలో రాష్ట్రం చేసిన ప్రగతిని వివరించారు.
గతంలో జీతాల ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం పెన్షనర్లకు కూడా నెల మొదటివ తేదీన అందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వ పాలన వేగం పెంచడం ద్వారా ప్రజలకు త్వరితగతిన సేవలు అందుతాయని, పెట్టుబడులు ఆకర్షించడానికి జిల్లాల మధ్య పోటీ అవసరమని సూచించారు.
రేషన్ బియ్యం మాఫియాను అరికట్టేందుకు కలెక్టర్లు, ఎస్పీలు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ మాఫియాను నిర్మూలించేందుకు సమన్వయంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
వివరాలు
దీపం 2 పథకం కింద 40 లక్షల మందికి లబ్ధి
భూకబ్జాలకు, పోర్టులు, సెజ్‌ల అక్రమాలకు నిరోధకంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 2047 లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ విజయ ప్రణాళిక అమలవుతుందని, 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని, సామాజిక పెన్షన్లకే 33 వేల కోట్లు వెచ్చించామని వివరించారు.
దీపం 2 పథకం కింద 40 లక్షల మందికి లబ్ధి చేకూరుస్తామని, 16,000 టీచర్ పోస్టుల భర్తీ త్వరలో జరగనుందని ప్రకటించారు.