Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. కేంద్ర మంత్రివర్గ ఆమోదం తర్వాత.. పార్లమెంటు ముందుకు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. ఏపీ రాష్ట్ర విభజన చట్టంలోని పార్ట్-2, సెక్షన్ 5(2)కి సవరణ చేయడానికి ఇప్పటికే తొలి చర్యలు మొదలయ్యాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర న్యాయశాఖ నుంచి అనుమతి లభించింది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం అందిన వెంటనే ఈ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సభలలో ఆమోదం అనంతరం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
వివరాలు
అమరావతిని ఏపీ రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ ప్రభుత్వం
రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం అమరావతిని ఏపీ రాజధానిగా ఎంపిక చేసింది. దీనికి మద్దతుగా 29 గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా సుమారు 34 వేల ఎకరాల భూమిని సమీకరించారు. సింగపూర్ ప్రభుత్వ భాగస్వామ్యంతో అమరావతి కోసం విస్తృత మాస్టర్ ప్లాన్ రూపొందించారు. టీడీపీ పాలనకాలంలోనే అసెంబ్లీ,సచివాలయ భవనాల నిర్మాణం పూర్తై పాలన ప్రారంభమైంది. పెద్దఎత్తున రహదారి మార్గాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు కొనసాగాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. దీంతో అమరావతి ప్రాజెక్టు పూర్తిగా వెనుకబడి పోయింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అమరావతి మళ్లీ ప్రాధాన్యం పొందింది.
వివరాలు
రూ.58 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు
రూ.58 వేల కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులను తిరిగి ప్రారంభించారు. భవిష్యత్తులో అమరావతికి ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అమరావతిని అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నోటిఫై చేస్తూ పార్లమెంట్ ద్వారా చట్ట సవరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
వివరాలు
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రస్తుత నిబంధనలు ఇవీ:
పార్ట్-2 కింద సెక్షన్ 5(1) ప్రకారం — నిర్ణయించిన తేదీ నుంచి గరిష్టంగా పదేళ్ల పాటు హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి. అదే విధంగా పార్ట్-2 కింద సెక్షన్ 5(2) ప్రకారం — 5(1)లో పేర్కొన్న గడువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధానిగా కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా నూతన రాజధాని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
వివరాలు
అమరావతిని రాజధానిగా నోటిఫై చేసే ప్రక్రియ ఇలా ఉంటుంది:
రాష్ట్ర విభజన చట్టంలోని పార్ట్-2, సెక్షన్ 5(2)లో ఉన్న "ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటవుతుంది" అనే వాక్యాన్నే సవరిస్తూ, "అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధాని ఏర్పాటైంది" అని స్పష్టంగా చేర్చనున్నారు. ఆ తరువాత ఈ సవరణ పార్లమెంట్ ఆమోదం పొందిన వెంటనే గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తారు.