Loading...
Supreme Court: ఉరిశిక్ష స్థానంలో లెథల్‌ ఇంజెక్షన్‌? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
ఉరిశిక్ష స్థానంలో లెథల్‌ ఇంజెక్షన్‌? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

Supreme Court: ఉరిశిక్ష స్థానంలో లెథల్‌ ఇంజెక్షన్‌? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
01:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉరిశిక్షకు బదులుగా ఖైదీకి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఉరివేయడం ద్వారా మరణశిక్ష అమలు చేయడం రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో మరణశిక్ష అమలుకు ఉరిశిక్ష విధానమే కొనసాగుతుందని తెలిపింది. జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఖైదీకి తక్కువ బాధ కలిగేలా, అతడి గౌరవాన్ని కాపాడే విధంగా ఉరిశిక్షకు ప్రత్యామ్నాయ పద్ధతిని తీసుకురావాలని పిటిషన్‌లో కోరారు. అయితే ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది. అలా చేయడానికి తగిన కారణాలు కనిపించడం లేదని తెలిపింది.

వివరాలు 

ఏం కోరారు?

న్యాయవాది రిషి మల్హోత్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో ఉరిశిక్షకు బదులుగా లెథల్‌ ఇంజెక్షన్‌, కాల్చి చంపడం, విద్యుదాఘాతం లేదా గ్యాస్‌ ఛాంబర్‌ వంటి ప్రత్యామ్నాయాలను సూచించారు.

వీటి ద్వారా కొన్ని నిమిషాల్లోనే మరణశిక్షను అమలు చేయవచ్చని పేర్కొన్నారు.

ఉరివేయడం అత్యంత బాధాకరమైన, అమానవీయమైన, క్రూరమైన విధానమని పిటిషన్‌లో వాదించారు.

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (CrPC)లోని సెక్షన్‌ 354(5) ప్రకారం ఉరివేయడం ద్వారా మరణశిక్ష అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటిషనర్‌ కోరారు.

గౌరవప్రదంగా మరణించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

ఏం కోరారు?

ఉరివేసిన తర్వాత మరణాన్ని నిర్ధారించేందుకు దాదాపు 40 నిమిషాల సమయం పడుతుందని, అదే కాల్చడం లేదా లెథల్‌ ఇంజెక్షన్‌ ద్వారా అయితే సుమారు ఐదు నిమిషాల్లో ప్రక్రియ పూర్తవుతుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరణశిక్ష విధించిన సందర్భంలో సాధ్యమైనంత తక్కువ బాధ కలిగే విధంగా దాన్ని అమలు చేయాలని సూచించే ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని కూడా రిషి మల్హోత్రా ప్రస్తావించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చు

అయితే ప్రస్తుత తీర్పుతో ఈ అంశానికి పూర్తిగా తెరపడినట్లు భావించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భవిష్యత్తులో ప్రత్యామ్నాయ మరణశిక్ష విధానాలపై బలమైన శాస్త్రీయ, వైద్య లేదా ఇతర ఆధారాలు వెలుగులోకి వస్తే ఈ అంశాన్ని మరోసారి రాజ్యాంగపరంగా పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న నిర్ణయానికి ఆధారమైన శాస్త్రీయ అంశాలు కొత్త ఆధారాలతో మారినట్లు నిరూపితమైతే భవిష్యత్తులో కోర్టు ఈ అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది.

మరణశిక్ష అమలు కోసం ప్రత్యామ్నాయ పద్ధతులపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయవచ్చని కూడా సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ అంశంపై విచారణను పూర్తి చేసిన కోర్టు జనవరి 22న తీర్పును రిజర్వ్‌ చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

కేంద్రం ఏం చెప్పింది?

కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమణి గతంలో వాదనలు వినిపిస్తూ, ఈ అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందని కోర్టుకు తెలిపారు.

2025 అక్టోబర్‌ 15న జరిగిన విచారణ సందర్భంగా ఉరిశిక్ష విధానాన్ని మార్చేందుకు కేంద్రం ఆసక్తి చూపడం లేదంటూ సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

విచారణ సమయంలో ఖైదీలకు ఉరి లేదా లెథల్‌ ఇంజెక్షన్‌లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలనే సూచన కూడా వచ్చింది.

అయితే అలా చేయడం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని కేంద్రం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కాలానుగుణంగా మారేందుకు కేంద్రం సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.

వివరాలు 

కేంద్రం ఏం చెప్పింది?

కేంద్రం తరఫున సీనియర్‌ న్యాయవాది సోనియా మాథుర్‌ వాదిస్తూ, ఇది ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశమని తెలిపారు.

దీనిపై ధర్మాసనం మౌఖికంగా స్పందిస్తూ.. "ప్రభుత్వం మారేందుకు సిద్ధంగా లేకపోవడమే సమస్య" అని వ్యాఖ్యానించింది.

ఇది చాలా పాత విధానమని, కాలంతో పాటు పరిస్థితులు కూడా మారాయని కోర్టు పేర్కొంది.

ADVERTISEMENT