Loading...
Amit Shah: ఓటర్ల జాబితా సవరణపై చర్చిద్దాం.. రాహుల్ గాంధీకి అమిత్ షా ఛాలెంజ్
ఓటర్ల జాబితా సవరణపై చర్చిద్దాం.. రాహుల్ గాంధీకి అమిత్ షా ఛాలెంజ్

Amit Shah: ఓటర్ల జాబితా సవరణపై చర్చిద్దాం.. రాహుల్ గాంధీకి అమిత్ షా ఛాలెంజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
10:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు సవాల్ విసిరారు. అవసరమైతే ఈ అంశంపై చర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం లక్నోలో నిర్వహించిన ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాల సవరణ అంశంపై చర్చించేందుకు తమ పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఈ విషయంలో దాచాల్సిందేమీ లేదని అమిత్ షా పేర్కొన్నారు.

వివరాలు

వీధుల్లో ఆందోళన చేయడంపై విమర్శలు

అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు ముందుకు రావడం లేదని ఆరోపించారు. పైగా సభా కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని విమర్శించారు.

రాహుల్ గాంధీ పార్లమెంటులో చర్చించకుండా వీధుల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు.

హర్యానా, మహారాష్ట్ర, బిహార్, ఢిల్లీ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో బీజేపీ సాధించిన విజయాలను ఈ సందర్భంగా అమిత్ షా ప్రస్తావించారు.

ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని ప్రతిపక్షాలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. అందుకే ఓటమిని అంగీకరించకుండా ఓట్ల చోరీ జరిగిందంటూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.

వివరాలు

సీఈసీపై కాంగ్రెస్ ప్రజా అభిశంసన వాయిదా

మరోవైపు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌పై ప్రజా అభిశంసన కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

అయితే ఈ కార్యక్రమం వర్షం కారణంగా వాయిదా పడింది. శుక్రవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని శనివారానికి మార్చారు.

తొలుత ఈ కార్యక్రమానికి మాక్ పార్లమెంటుగా పేరు పెట్టిన కాంగ్రెస్.. ఆ తర్వాత ప్రజా అభిశంసనగా మార్చింది. సీఈసీని అభిశంసించే ప్రక్రియ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన నోటీసులు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి.

అంతేకాకుండా, ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సంఖ్యాబలం కూడా కాంగ్రెస్‌కు లేదు.

ఈ నేపథ్యంలో శనివారం నిర్వహించనున్న ప్రజా అభిశంసన కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు

ఆదివారం ఇండియా కూటమి భారీ ర్యాలీ

ఇదిలా ఉండగా, ఎన్నికల కమిషన్, ఎస్ఐఆర్ విధానానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి మరో కార్యక్రమానికి సిద్ధమైంది.

ఆదివారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. ఎన్నికల సంఘం వ్యవహారశైలి, ప్రత్యేక సమగ్ర సవరణ విధానానికి వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపట్టనుంది.

దీంతో ఓటర్ల జాబితాల సవరణ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు మరింత వేడెక్కుతోంది.

ADVERTISEMENT