
Hazardous cargo: కేరళ తీరంలో లైబీరియా నౌక మునిగింది.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
ఈ వార్తాకథనం ఏంటి
లైబీరియాకు చెందిన భారీ నౌక 'ఎంఎస్‌సీ ఎల్సా-3' కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. మొదట నౌక ఒక వైపు ఒరిగిపోవడంతో పలు కంటైనర్లు సముద్రంలోకి పడిపోయాయి.
చివరికి అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) వెల్లడించింది.
ఈ 184 మీటర్ల పొడవున్న కంటైనర్ నౌక విఝింజమ్ పోర్టు నుంచి శుక్రవారం బయల్దేరి శనివారం మధ్యాహ్నం 'కొచ్చిన్' చేరాల్సి ఉంది. అయిత అది ప్రమాదానికి గురైంది.
తక్షణ స్పందనగా కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.
నౌకలో ఉన్న మొత్తం 24 మంది సిబ్బందిని సురక్షితంగా తీరానికి చేర్చినట్లు అధికారులు తెలిపారు.
Details
పర్యావరణానికి హాని కలిగే అవకాశం
నౌకలో మొత్తం 640 కంటైనర్లు ఉండగా, వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకర రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు గుర్తించారు.
ఈ రసాయనాలు, ఇంధనం సముద్రంలో లీకైనట్లయితే తీవ్ర పర్యావరణ హానికి దారితీయవచ్చునని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొచ్చి తీర ప్రాంతానికి హై అలర్ట్ ప్రకటించగా, కంటైనర్లు లేదా వాటిలోని ఇంధనం తీరానికి వస్తే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని ప్రజలను 'కేరళ విపత్తు నిర్వహణ సంస్థ' హెచ్చరించింది.
Details
ముందస్తు చర్యలు తీసుకుంటున్న అధికారులు
సముద్రంలో ఇంధనం లీకైన మోతాదును అంచనా వేసేందుకు ప్రత్యేకంగా ఆయిల్ స్పిల్ మ్యాపింగ్ టెక్నాలజీను ఉపయోగిస్తున్న విమానం సముద్రంపై పర్యవేక్షణ సాగిస్తోంది.
ప్రస్తుతం తీర ప్రాంతాల్లో పర్యావరణ హానిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
ఈ ఘటన భారతీయ సముద్ర భద్రతా వ్యవస్థకు మరో సవాలుగా మారిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.