
Andhra Pradesh: ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికలను 2026 జనవరిలో నిర్వహించేందుకు ప్రాథమిక సన్నాహాలను ప్రారంభించింది. చట్టం ప్రకారం, ఐదేళ్ల పదవీ కాలం ముగియడానికి మూడు నెలల ముందు ఎన్నికలు జరగడానికి ఏర్పాట్లు చేయవలసిన విధానం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, పంచాయతీరాజ్, నగరపాలక, పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖల ద్వారా సూచనలు జారీ చేశారు. ప్రస్తుతం సర్పంచుల పదవీ కాలం 2026 ఏప్రిల్‌లో ముగియనుంది. అలాగే, నగరపాలక, పురపాలక సంస్థలు మరియు నగర పంచాయతీలలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీ కాలం 2026 మార్చిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో జనవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పటిదంచి అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కమిషనర్ లేఖలో పేర్కొన్నారు.
షెడ్యూల్
ఆ లేఖ ప్రకారం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ఇలా....
అక్టోబరు 15, 2025: వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తిచేయాలి. అక్టోబరు 16 - నవంబరు 15, 2025: వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి, ప్రచురించాలి. నవంబరు 1 - 15, 2025: ఎన్నికల అధికారుల నియామకాలు పూర్తిచేయాలి. నవంబరు 16 - 30, 2025: పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసి, ఈవీఎంలు సిద్ధం చేయడం, సేకరణ వంటి పనులు పూర్తి చేయాలి. డిసెంబర్ 15, 2025: రిజర్వేషన్లు ఖరారు చేయాలి. డిసెంబర్ చివరి వారంలో: రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి. జనవరి 2026: ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడం, అదే నెలలో ఫలితాలను ప్రకటించడం.