IAF transport aircraft: వాయుసేనకు ఎంటీఏ విమానాలు.. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, లాక్‌హీడ్ ఒప్పందం
భారత వాయుసేనకు టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్,లాక్‌హీడ్ మార్టిన్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎంటీఏ) విమానాలను అందిస్తామని ప్రకటించాయి. సి-130 జే సూపర్ హెర్క్యులస్ టాక్టికల్ ఎయిర్ లిఫ్టర్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఈ విమానాలను తయారు చేస్తారు. ఈ భాగస్వామ్యం కోసం రెండు సంస్థలు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనితో భారత వాయుసేనకు చెందిన 12 సి-130 జే సూపర్ హెర్క్యులస్ విమానాలతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ తరహా విమానాల నిర్వహణ కోసం మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) సదుపాయాన్ని భారత్‌లో నెలకొల్పనున్నారు. అంతేకాకుండా,భారత వాయుసేన కోసం ఎంటీఏ విమానాల ఉత్పత్తి,అసెంబ్లీకి అవసరమైన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం లాక్‌హీడ్ మార్టిన్‌కు ఈ విమానాల తయారీ యూనిట్ జార్జియాలో ఉంది.
80 విమానాల కొనుగోలు ప్రణాళిక
టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ సుకరన్ సింగ్ లాక్‌హీడ్ మార్టిన్‌తో కుదిరిన ఈ ఒప్పందం వ్యూహాత్మక ముందడుగు అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంతో, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ డిఫెన్స్ ఎంఆర్‌ఓ వ్యాపార విభాగంలోకి ప్రవేశిస్తోంది. భారత వాయుసేన 80 మీడియం ట్రాన్స్‌పోర్ట్ విమానాలను కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంది. సి-130 జే సూపర్ హెర్క్యులస్ ఈ ప్రాజెక్టుకు అనువైనది కాబట్టి, ఈ విమానాల సరఫరాకు లాక్‌హీడ్ మార్టిన్ ఆసక్తి చూపింది.