Page Loader
Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌
ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌

Taj Banjara: ఆస్తి పన్ను చెల్లించకపోతే తాళాలు.. తాజ్‌ బంజారా హోటల్‌కి జీహెచ్‌ఎంసీ షాక్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

జీహెచ్‌ఎంసీ ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై కఠినంగా వ్యవహరిస్తోంది. మొండి బకాయిలను చెల్లించని ఆస్తులను సీజ్‌ చేస్తోంది. తాజాగా నగరంలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌కు షాక్‌ ఇచ్చింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 1లో ఉన్న తాజ్‌ బంజారా హోటల్‌ను అధికారులు సీజ్‌ చేశారు. రెండు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకపోవడంతో హోటల్‌ గేట్లకు తాళాలు వేశారు. పలుమార్లు నోటీసులు పంపినా హోటల్‌ యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. హోటల్‌కు రూ.1.43 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయని వెల్లడించారు. రెడ్‌ నోటీసు ఇచ్చినా స్పందించకపోవడంతో శుక్రవారం ఉదయం హోటల్‌ను సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు. జీహెచ్‌ఎంసీకి మొత్తం రూ.9,800 కోట్ల మొండి బకాయిలు రావాల్సి ఉంది.

Details

మార్చి 29 లోపల చెల్లించాలి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.2,200 కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో 23 లక్షల నిర్మాణాలుండగా, వీటిలో 12 లక్షల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు. ఐదు లక్షల నిర్మాణాల యజమానులు ఆస్తి పన్ను చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. గత ఆర్థిక సంవత్సరంలో లక్షా 8 వేల ఆస్తుల నుంచి రూ.320 కోట్లు వసూలు చేశారు. పెండింగ్‌లో ఉన్న పన్నులను మార్చి 29వ తేదీలోగా వసూలు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆస్తి పన్ను చెల్లింపుల పెండింగును తగ్గించేందుకు మరోసారి వన్‌టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) విధానం అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు.