Lok Sabha Election schedule: మార్చి 9 తర్వాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్!
Lok Sabha Election schedule: 2024 లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్పనన్నమవుతున్న ప్రశ్న ఇది. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. జమ్ముకశ్మీర్‌లో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించిన తర్వాత మార్చి 9 తర్వాత ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఏప్రిల్-మేలో ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్నికల అధికారులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లో సమీక్షలు పూర్తయ్యాయి.
2019 మాదిరిగానే 2024లో కూడా
2019 మాదిరిగానే 2024లో కూడా ఎన్నికలను ఏడు విడుతల్లో ఎన్నికల సంఘం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 2019లో 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. మార్చి 10న ఎన్నికల తేదీలను కమిషన్ ప్రకటించింది. ఆ సమయంలో మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 11న, రెండో దశలో ఏప్రిల్ 18న, మూడో దశలో ఏప్రిల్ 23న, నాలుగో దశలో ఏప్రిల్ 29న, ఐదో దశలో మే 6న, ఆ తర్వాత మే 12న, చివరి దశ మే 19న జరిగింది. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. లోక్‌సభతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి.