Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు
రాబోయే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరింది. శనివారం దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇరు పార్టీల నేతలు సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పొత్తు వివరాలను వెల్లడించారు. అయితే పంజాబ్‌లో మాత్రం ఈ రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తుండటం గమనార్హం. దిల్లీలో ఆప్ న్యూదిల్లీ, పశ్చిమ దిల్లీ, తూర్పు దిల్లీ, దక్షిణ దిల్లీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని.. చాందినీ చౌక్, నార్త్ వెస్ట్, ఈశాన్య దిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు.
గుజరాత్‌లో రెండు స్థానాల్లో ఆప్.. 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ
గుజరాత్‌లో మొత్తం 26ఎంపీ స్థానాలు ఉండగా.. భరూచ్, భావ్‌నగర్‌లోని రెండు స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుండగా.. మిగిలిన 24 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేయనున్నారు. హర్యానాలో కాంగ్రెస్ 9స్థానాల్లో, ఆప్ ఒక స్థానంలో పోటీ చేయాలని నిర్ణయించాయి. మరోవైపు చండీగఢ్ లోక్‌సభ, గోవాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. గత కొంతకాలంగా ఉత్తరాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కానీ ఆ పార్టీకి అనుకున్న ఫలితాలు రాలేదు. దీంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో ఎలాగైనా సత్తా చాటాలని ఆప్ భావిస్తోంది. ముఖ్యంగా ఆప్‌కు జాతీయ పార్టీ హోదా దక్కిన తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా విఫలమైంది.