VB G RAM G Bill: 'ఉపాధి' స్థానంలో 'జీ రామ్ జీ'కి లోక్‌సభ ఆమోదం..
ఈ వార్తాకథనం ఏంటి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై సభలో తీవ్ర చర్చ సాగగా, విపక్షాలు పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. వారి నిరసనల మధ్య స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా, చివరకు బిల్లుకు మెజారిటీ మద్దతు లభించింది. ఓటింగ్ సమయంలో విపక్ష ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నిరసనకు దిగారు. కొందరు ప్రతిపక్ష నేతలు 'వీబీ జీ రామ్ జీ' బిల్లు ప్రతులను చించివేసి విసిరేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
వివరాలు
సంక్షేమ కార్యక్రమాలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే..
ఈ పరిస్థితుల నేపథ్యంలో లోక్‌సభను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇదే అంశంపై ముందుగా జరిగిన చర్చలో విపక్షాల ఆరోపణలకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సమాధానం ఇచ్చారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగానే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. "బాపూజీ సిద్ధాంతాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. కానీ ఎన్డీయే ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది. పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్ మిషన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా గాంధీజీ కలలను మేం నిజం చేస్తున్నాం" అని తెలిపారు.
వివరాలు
గత కాంగ్రెస్ పాలనపై చౌహన్ తీవ్ర విమర్శలు
ఈ సందర్భంగా గత కాంగ్రెస్ పాలనపై చౌహన్ తీవ్ర విమర్శలు చేశారు. "మొదట్లో ఉపాధి హామీ పథకానికి NREGA అనే పేరు ఉండేది. 2009 లోక్‌సభ ఎన్నికల వేళ ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి మహాత్మాగాంధీ పేరు జత చేసింది. అంతేకాదు, వారి పాలనలో ఈ పథకం అమలులో అనేక లోపాలు ఉన్నాయి. కూలీలపై అధికంగా ఖర్చు చేసి, అవసరమైన మెటీరియల్ కొనుగోలుకు మాత్రం తక్కువ నిధులు కేటాయించారు" అని ఆరోపించారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ, గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలకు గాంధీ-నెహ్రూ కుటుంబ పేర్లు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
వివరాలు
2009లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం
గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, పల్లెల్లో సుస్థిర ఆస్తుల సృష్టి, వనరుల ఉత్పాదకత పెంపు వంటి లక్ష్యాలతో దాదాపు రెండు దశాబ్దాల క్రితం 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం 'ఎన్‌ఆర్‌ఈజీఏ' చట్టాన్ని తీసుకొచ్చింది. అనంతరం 2009లో దీనికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనే పేరు పెట్టారు.