Delimitation row: లోక్‌సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం.. జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఇప్పటివరకు జనాభా ఆధారంగా సీట్లు కేటాయించే విధానానికి భిన్నంగా, రాష్ట్రాల ఆర్థిక పనితీరును ప్రతిబింబించే స్థూల రాష్ట్ర ఉత్పత్తి ఆధారంగా ఎంపీ స్థానాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు 38, తెలంగాణకు 30 లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశముందని తెలిపారు. జనాభా నియంత్రణను పాటిస్తూ,ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు,కేవలం జనాభా ఆధారంగా జరిగే పునర్విభజన వల్ల రాజకీయంగా వెనుకబడే ప్రమాదం ఉందనే అభిప్రాయం చాలాకాలంగా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పనితీరు ఆధారంగా సీట్ల కేటాయింపులు ఉండాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదనలో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
వివరాలు
తెలంగాణ,ఆంధ్రకు పెరగనున్న 13 సీట్లు
ఈ విధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గకుండా కాపాడుకోవచ్చని ఆయన వర్గం భావిస్తోంది. ఈ ప్రతిపాదిత విధానం ప్రకారం తెలంగాణకు ప్రస్తుతం ఉన్న 17 సీట్లకు అదనంగా 13 సీట్లు చేరి మొత్తం 30కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు కూడా 13 సీట్లు పెరిగి మొత్తం 38కి చేరుకుంటాయి.
వివరాలు
కేంద్ర రాజకీయాల్లో ఆర్థికంగా బలమైన రాష్ట్రాల ప్రాధాన్యం
దక్షిణాది రాష్ట్రాలలో తమిళనాడుకు 62, కర్ణాటకకు 49 స్థానాలు లభించే అవకాశముంది. మరోవైపు మహారాష్ట్రకు 35 సీట్లు పెరిగి మొత్తం 83కి చేరగా, అధిక జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌కు 29 సీట్లు పెరిగి 109కి చేరనున్నాయి. మొత్తంగా ఈ ప్రతిపాదన అమలులోకి వస్తే కేంద్ర రాజకీయాల్లో ఆర్థికంగా బలమైన రాష్ట్రాల ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. జనాభా పెరుగుదలకంటే ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే విధంగా రాష్ట్రాలను ప్రోత్సహించడమే ఈ జీఎస్డీపీ ఆధారిత విధానం ప్రధాన లక్ష్యంగా భావిస్తున్నారు.