
Om Birla: నినాదాలు ఉన్న టీ-షర్టులు ధరించి సభకు రావొద్దు: స్పీకర్ ఓం బిర్లా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు ధరించి లోక్‌సభకు రావడంపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు.
ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు.
"సభలు నిబంధనలు,విధానాల ప్రకారం నిర్వహించాలి.సభ్యులు హుందాగా వ్యవహరించి సభ గౌరవాన్ని కాపాడుకోవాలి. అయితే,ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది ఎంపీలు నిబంధనలు పాటించడం లేదు. ఇది సరైన విధానం కాదు. ఎంతటి నేత అయినా సభ గౌరవాన్ని కాపాడేలా ఉండాలి. నినాదాలతో ఉన్న దుస్తులను ధరించడం ఆమోదయోగ్యం కాదు" అని ఓం బిర్లా స్పష్టంగా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తూ,సభ్యులకు బయటకు వెళ్లి దుస్తులు మార్చుకుని రావాలని సూచించారు.
వివరాలు
నియోజకవర్గాల పునర్విభజనపై వివాదం
కేంద్రంలోని బీజేపీ, తమిళనాడులోని డీఎంకే మధ్య నియోజకవర్గాల పునర్విభజన అంశంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో గురువారం డీఎంకే సభ్యులు నినాదాలతో ఉన్న టీ షర్టులు ధరించి పార్లమెంటుకు హాజరయ్యారు.
"పునర్విభజన న్యాయబద్ధంగా జరగాలి", "తమిళనాడు పోరాడుతుంది", "తమిళనాడు గెలుస్తుంది" అనే నినాదాలు టీ షర్టులపై కనిపించాయి.
దీనికి సంబంధించిన నిరసనలను పార్లమెంటు వెలుపల కూడా డీఎంకే సభ్యులు వ్యక్తం చేశారు. లోక్‌సభలోనూ ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు వారు ప్రయత్నించారు.