LOADING...
AP WhatsApp Governance :త్వరలో 'మనమిత్ర 2.0'.. ఐటీ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
త్వరలో 'మనమిత్ర 2.0'.. ఐటీ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

AP WhatsApp Governance :త్వరలో 'మనమిత్ర 2.0'.. ఐటీ మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 27, 2026
04:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మనమిత్ర వాట్సాప్ సేవల గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే 'మనమిత్ర 2.0'ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మనమిత్ర ద్వారా 943 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా 1.48 కోట్ల సేవలను ప్రజలకు అందించినట్టు వివరించారు. త్వరలోనే మనమిత్ర 2.0 మనమిత్ర సేవలను మరింత సమర్థవంతంగా మార్చేందుకు 'మనమిత్ర 2.0'ను తీసుకురానున్నామని మంత్రి ప్రకటించారు.

వివరాలు 

యూజర్ ఫ్రెండ్లీగా రూపుదిద్దుతాం:  మంత్రి లోకేశ్

వాట్సాప్ సేవలపై వినియోగదారుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని నారా లోకేశ్ తెలిపారు. కృత్రిమ మేధస్సు (AI)సాంకేతికతను అనుసంధానం చేసి యాప్‌ను మరింత సౌకర్యవంతంగా, సులభంగా ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. శాసనసభలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ,వాట్సాప్ ఆధారిత సేవల వల్ల ప్రజలకు సమయం ఆదా అవుతోందని పేర్కొన్నారు. ఎలాంటి ఫీజులు లేకుండా సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. అయితే యాప్ నెమ్మదిగా పనిచేస్తుండటంతో కొంతమంది వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని సూచించారు. ఇతర యాప్‌ల మాదిరిగా ఒకసారి వివరాలు నమోదు చేసిన తర్వాత మళ్లీ మళ్లీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా సదుపాయం కల్పించాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు సైతం సులభంగా వినియోగించుకునేలా యాప్‌ను మరింత సరళంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

వివరాలు 

ప్రాసెస్ రీ-ఇంజినీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది: లోకేష్ 

ఈ సూచనలకు స్పందించిన ఐటీ మంత్రి లోకేశ్, "మనమిత్ర ప్లాట్‌ఫారమ్‌లో ప్రభుత్వం ఎలాంటి వ్యక్తిగత డేటాను నిల్వ చేయడం లేదు. వాట్సాప్ ఒక వేదిక మాత్రమే. అసలు డేటా సంబంధిత శాఖల వద్దనే ఉంటుంది. అందువల్ల ప్రతి సారి వినియోగదారులు వివరాలు నమోదు చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం వివిధ విభాగాల్లోని ప్రక్రియలను డిజిటలైజ్ చేయడం మాత్రమే పూర్తయింది. ఇకపై ప్రాసెస్ రీ-ఇంజినీరింగ్ చేయాల్సిన అవసరం ఉంది" అని వివరించారు.

Advertisement

వివరాలు 

ఇంటింటికీ ప్రచారం

"ఇప్పటి రోజుల్లో ఒకే బటన్ నొక్కితే అనేక సేవలు ఇంటి వద్దనే అందుతున్నాయి. అదే విధంగా ప్రజలకు అవసరమైన పౌరసేవలు,సర్టిఫికెట్లు కూడా సెల్‌ఫోన్ ద్వారా సులభంగా అందుబాటులోకి రావాలన్న ఆలోచన నాకు యువగళం పాదయాత్ర సమయంలో కలిగింది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేనివిధంగా ఒకే ఫోన్ నంబర్ ద్వారా విస్తృత స్థాయిలో వాట్సాప్ సేవలు అందిస్తున్నాం. అయితే సేవల వేగాన్ని మరింత పెంచాలి. వెంటనే రసీదు అందే విధానం ఉండాలి. క్యూ ఆర్ కోడ్‌కు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించాల్సి ఉంది. మనమిత్ర యాప్‌పై సభ్యులు,ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి. 90రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి'మనమిత్ర 2.0'ను ప్రారంభిస్తాం. దీనిపై ఇంటింటికీ ప్రచారం నిర్వహించే ఆలోచన కూడా ఉంది"అని మంత్రి లోకేశ్ వెల్లడించారు.

Advertisement