ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ : సీఐడీ ఎఫెక్ట్.. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదా
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మళ్లీ వాయిదా పడింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్, రిమాండ్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు పర్యటనలో పాదయాత్ర నిలిచిపోయింది. సుమారు 20 రోజుల తర్వాత సెప్టెంబరు 29, శుక్రవారం రాత్రి 8.15 గంటలకు పాదయాత్రను పునఃప్రారంభించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంలో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర వాయిదా వేసుకోవాలని పార్టీ కీలక నేతలు లోకేశ్‌కి సూచించారు. పాదయాత్ర చేస్తే చంద్రబాబు కేసు విషయంలో న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణకు ఆటంకాలు ఎదురవుతాయని లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
దిల్లీలో న్యాయవాదులకు అందుబాటులో ఉండాల్సిన దృష్ట్యా పాదయాత్ర వాయిదా
ఈ మేరకు పార్టీ నేతల సలహాలు, సూచనలతో లోకేశ్ ఏకీభవించారు. దీంతో యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకునేందుకు నిర్ణయించారు. త్వరలోనే పార్టీ పొలిట్ బ్యూరో నాయకులతో చర్చించి యువగళం ప్రారంభ తేదీని ప్రకటించే యోచనలో ఉన్నారు. ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపుతో అనేక కేసులు తెరపైకి తీసుకొచ్చి తెలుగుదేశం అధినేత చంద్రబాబుని ఇబ్బంది పెడుతున్న దృష్ట్యా దిల్లీలో న్యాయవాదులతో లోకేశ్ సంప్రదింపులు చేయాల్సిన అవసరముందని ఆయా నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మరోవైపు పాదయాత్ర చేస్తే తనను అరెస్ట్ చేసే అవకాశమున్నట్లు లోకేశ్ భావిస్తున్నారు. ఈ మేరకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. అప్పటివరకు పాదయాత్ర చేయకూడదనే భావిస్తున్నట్లు తెలుస్తోంది.ే