Loading...
Saurav Das: సౌరవ్‌ దాస్‌ పాస్‌పోర్టులో లోపాలు.. లుకౌట్‌ నోటీసు జారీ చేసిన పోలీసులు
సౌరవ్‌ దాస్‌ పాస్‌పోర్టులో లోపాలు.. లుకౌట్‌ నోటీసు జారీ చేసిన పోలీసులు

Saurav Das: సౌరవ్‌ దాస్‌ పాస్‌పోర్టులో లోపాలు.. లుకౌట్‌ నోటీసు జారీ చేసిన పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 26, 2026
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీజేపీ నాయకుడు సౌరవ్‌ దాస్‌ (Saurav Das) పాస్‌పోర్టు వ్యవహారం రోజురోజుకూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన పాస్‌పోర్టులోని వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు తాజాగా లుకౌట్‌ నోటీసు (LOC) జారీ చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దిల్లీ న్యాయస్థానానికి వెల్లడించింది. ఇటీవల యూకేలోని ప్రతిష్ఠాత్మక 'ఆక్స్‌ఫర్డ్‌ యూనియన్‌' చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సౌరవ్‌ దాస్‌ బయలుదేరారు. అయితే దిల్లీ విమానాశ్రయంలో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చేతన శర్మ న్యాయస్థానంలో వాదనలు

సౌరవ్‌ దాస్‌ పాస్‌పోర్టు రికార్డులను పరిశీలించగా.. ఆయన చదువుకున్న పాఠశాల వివరాలు, చిరునామా, తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారంలో తేడాలు ఉన్నట్లు గుర్తించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ చేతన శర్మ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

ఈ నెల 23న ముంబయి పోలీసులు సౌరవ్‌ దాస్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.

మరోవైపు, తమ క్లయింట్‌పై లుకౌట్‌ నోటీసు జారీ చేసిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని సౌరవ్‌ దాస్‌ తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు.

ఆయన దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాతే షోకాజ్‌ నోటీసులు అందించారని కోర్టుకు వివరించారు.

వివరాలు 

నవంబర్‌ 23న సౌరవ్‌ దాస్‌కు నోటీసులు జారీ

అంతేకాకుండా, లుకౌట్‌ నోటీసుల గురించి ముందుగా ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు.

అసలు ఎల్‌వోసీ జారీ చేయడానికి గల కారణాలను వెల్లడించాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వుల ప్రతిని తమకు అందించాలని న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

ఇదిలా ఉండగా, సౌరవ్‌ దాస్‌ పాస్‌పోర్టులోని వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయన్న అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జయస్‌వాల్‌ కూడా స్పందించారు.

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. పాస్‌పోర్టులో పేర్కొన్న సమాచారంలో తేడాలను అధికారులు గుర్తించారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే నవంబర్‌ 23న ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు వివరించారు.

ADVERTISEMENT