Teenmaar Mallanna: పాదయాత్రలో కలకలం.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాదయాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అనాజీపురం చౌరస్తా వద్ద ఈ ఘటన జరిగింది. పాదయాత్ర తిరుమలగిరి వైపు వెళ్తుండగా.. మల్లన్న ప్రయాణిస్తున్న టయోటా కారును వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న ఆల్ట్రోజ్ వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీన్మార్ మల్లన్నకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఆయన అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాలు
మరో కారులో ఇద్దరికి తీవ్ర గాయాలు
లారీ ఢీకొట్టడంతో ఎదురుగా వస్తున్న ఆల్ట్రోజ్ కారులో ప్రయాణిస్తున్న తిరుమలగిరికి చెందిన మేడబోయిన సాయినాథ్‌తో పాటు ఆయన డ్రైవర్ భార్య తీవ్రంగా గాయపడ్డారు.
వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం నార్కట్‌పల్లిలోని కామినేని ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. ప్రమాదం జరిగిన సమయంలో మల్లన్న ప్రయాణిస్తున్న టయోటా కారులో డ్రైవర్ బన్నీ, ఆయన సన్నిహితుడు రంగన్న కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ప్రమాదంపై అనుమానాలు.. పోలీసుల దర్యాప్తు
తీన్మార్ మల్లన్న పాదయాత్ర కొనసాగుతున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో టీఆర్పీ నాయకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రమాదం ఎలా జరిగింది? లారీ కారును ఢీకొట్టడానికి గల కారణాలేంటి? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.