Weather Latest Update: బంగాళఖాతంలో అల్పపీడనం.. ఆ జిల్లాలకు హెచ్చరీకలు జారీ చేసిన ఐఎండీ
గాంగేటిక్ పశ్చిమ బెంగాల్‌లో నిన్న కొనసాగిన అల్పపీడనం ఈరోజు ఉదయం 5:30 గంటల సమయంలో బలహీనపడి, ఝార్ఖండ్, పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతం కానుంది. ఆగస్టు 29న తూర్పు-మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలో రాబోయే మూడ్రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాలు
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతంగా ఉండి, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఆగస్టు 29న తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ వైపునకు చేరే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తారు వర్షాలు పడే అవకాశాలున్నాయి.