Andhra Pradesh: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
భూమధ్య రేఖ సమీప ప్రాంతమైన నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా శ్రీలంక వైపు కదులుతుండగా, శుక్రవారం నాటికి ఇది బలహీనమయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు సమాచారం. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో శుక్రవారం నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు.
వివరాలు
పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
ఈ వాతావరణ పరిణామాల ప్రభావంతో శనివారం, ఆదివారం రోజుల్లో అండమాన్-నికోబార్ దీవులు, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అలాగే మధ్యప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఇక రాష్ట్రంలోనూ శనివారం నుంచి సోమవారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.