LPG Crisis Impact: రైల్వే ప్రయాణికులకు షాక్.. రైళ్లలో క్యాటరింగ్ సేవలు ఆగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో రైల్వే ప్రయాణికులకు అందించే ఆహార సేవలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైళ్లలో క్యాటరింగ్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలనే ఆలోచనలో భారతీయ రైల్వే ఉందని సమాచారం. దీనిపై తుది నిర్ణయం రైల్వే బోర్డు తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ సేవలు నిలిపివేస్తే, టికెట్ బుకింగ్ సమయంలో ముందుగానే భోజనం బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ (IRCTC) రిఫండ్ ఇవ్వనుంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావం ఐఆర్‌సీటీసీ నిర్వహించే బేస్ కిచెన్లపై పడుతోంది. ఈ బేస్ కిచెన్లలోనే రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం ముందుగా తయారు చేసి, తర్వాత ప్యాంట్రీ కార్లకు పంపిస్తారు.
వివరాలు
ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ ద్వారా రోజుకు సుమారు 17 లక్షల భోజనాలు
అధికారుల వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్ నెట్‌వర్క్. ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ ద్వారా రోజుకు సుమారు 17 లక్షల భోజనాలు ప్రయాణికులకు అందిస్తున్నాయి. అయితే ఎల్పీజీ సరఫరా ఇలాగే కొనసాగుతూ కొరత కొనసాగితే, రైళ్లలో భోజన సేవలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి రావచ్చని అధికారులు చెబుతున్నారు. "రైళ్లలో ప్రయాణికులకు అందించే భోజనం ఐఆర్‌సీటీసీ బేస్ కిచెన్లలోనే తయారు అవుతుంది. ఎల్పీజీ అందుబాటులో ఏవైనా సమస్యలు వస్తే, భోజనం తయారీ మరియు రైళ్లకు సరఫరాపై నేరుగా ప్రభావం పడుతుంది," అని ఒక రైల్వే అధికారి తెలిపారు.
వివరాలు
దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇబ్బందులు
ఇప్పటికే భోజనం ముందుగా బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి రిఫండ్ అందజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఎల్పీజీ కొరత ప్రభావం రైల్వేలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అనేక రెస్టారెంట్లు, హోటళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ముంబై, బెంగళూరు, పుణే, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో పలు రెస్టారెంట్లు, హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని పెట్రోలియం.సహజ వాయువు మంత్రిత్వ శాఖ వాణిజ్య ఎల్పీజీ సరఫరా లోపాన్ని సమీక్షించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. "రెస్టారెంట్లు,హోటళ్లు,ఇతర పరిశ్రమలకు ఎల్పీజీ సరఫరాపై వచ్చిన వినతులను పరిశీలించేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీ ఏర్పాటు చేశాం,"అని మంత్రిత్వ శాఖ ఎక్స్(X)లో తెలిపింది.