LPG Tanker Shivalik: భారత్‌కు ఎల్పీజీ ట్యాంకర్ 'శివాలిక్'.. రేపు రానున్న 'జగ్ లాడ్కీ'
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఎల్పీజీ (LPG) గ్యాస్‌ను తీసుకువచ్చిన 'శివాలిక్' ట్యాంకర్ సోమవారం భారత్‌కు చేరుకుంది. ఈ నౌక గుజరాత్ రాష్ట్రంలోని ముంద్రా పోర్ట్‌కు సోమవారం సాయంత్రం చేరినట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. 'శివాలిక్' నౌకలో సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ భారత్‌కు తరలించబడింది. ఈ నౌక హర్మూజ్ జలసంధిని దాటుకుని సోమవారం సాయంత్రానికి భారత్‌కు చేరుకుంటుందని షిప్పింగ్ మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా ముందుగానే వెల్లడించారు.
వివరాలు
సురక్షితంగా ఇండియాకు..
అదే విధంగా, సుమారు 80,000 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఆయిల్‌ను తీసుకువస్తున్న 'జగ్ లాడ్కీ' నౌక మంగళవారం భారత్‌కు చేరుకునే అవకాశముందని ఆయన తెలిపారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి పశ్చిమాన ప్రస్తుతం 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిలో 616 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. హర్మూజ్ జలసంధి ఇరువైపులా వందలాది నౌకలు నిలిచిపోయిన పరిస్థితి ఉన్నప్పటికీ, ఈ మార్గం ద్వారా భారత నౌకలు ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు భారత జెండాలతో ప్రయాణిస్తున్న ఎల్పీజీ నౌకలు రెండు రోజుల క్రితం సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. వాటిలో ఒకటి 'శివాలిక్' కాగా, మరొకటి 'నందాదేవి'.