LOADING...
Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు
పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు

Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
01:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి ముందు ముగ్గురు ఉగ్రవాదులు చెట్టు కింద కూర్చొని భోజనం చేసినట్లు విచారణలో బయటపడింది. 2025 ఏప్రిల్‌ 22న బైసరన్‌ లోయలో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 26 మందిని హతమార్చిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. చనిపోయిన వారిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ఉన్నారు. 'కల్మా' చెప్పలేని వారినే లక్ష్యంగా చేసుకుని కాల్చిచంపినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది.

వివరాలు 

దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను ఫైసల్ జట్ అలియాస్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అలియాస్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. వీరిని జూలై 29న శ్రీనగర్‌ శివార్లలో భారత భద్రతా బలగాలు నిర్వహించిన 'ఆపరేషన్ మహాదేవ్‌'లో హతమార్చాయి. మొత్తం 1,597 పేజీల చార్జ్‌షీట్‌లో ఈ కుట్రకు పాకిస్థాన్‌తో సంబంధాలున్నట్లు ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబా, అలాగే టీఆర్‌ఎఫ్‌ సంస్థలు ఈ దాడి వెనుక ఉన్నాయని పేర్కొంది.

వివరాలు 

పర్వేజ్ అహ్మద్ ఇంటికి ఉగ్రవాదులు 

దాడికి ఒక రోజు ముందు ఉగ్రవాదులు బైసరన్ సమీపంలోని స్థానికుడు పర్వేజ్ అహ్మద్ ఇంటికి వెళ్లినట్లు చార్జ్‌షీట్‌లో ఉంది. తన మామ బషీర్ అహ్మద్ జోథర్ ముగ్గురు తుపాకులతో వచ్చిన వ్యక్తులను ఇంట్లోకి తీసుకువచ్చాడని పర్వేజ్ విచారణలో తెలిపాడు. వారు అలసిపోయామని,దాహంగా ఉందని చెప్పడంతో నీళ్లు ఇచ్చానని వెల్లడించాడు. "అల్లాహ్ మార్గంలో పోరాడుతున్న వారికి నీళ్లు ఇచ్చినందుకు నీకు సవాబ్ వస్తుంది"అని వారు చెప్పినట్లు తెలిపాడు. వారు ఉర్దూలో పంజాబీ యాసతో మాట్లాడారని, అప్పుడే వాళ్లు కశ్మీరీలు కాదని అర్థమైందని చెప్పాడు. అనంతరం వారి బ్యాగులు,సామాను దాచిపెట్టాలని కోరడంతో దుప్పట్ల కింద దాచినట్లు తెలిపాడు. వారికి టీ,భోజనం ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి 10 గంటల సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయారని చెప్పాడు.

Advertisement

వివరాలు 

ఒక ఉగ్రవాది తలకు గోప్రో కెమెరా

ఈ కేసులో పర్వేజ్, అతని మామ బషీర్ అహ్మద్‌ను జూన్ 22న పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి జరిగిన రోజు ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు బైసరన్‌ లోయ సమీపంలో కనిపించినట్లు ఎన్‌ఐఏ తెలిపింది. లోయలోకి వెళ్లే ముందు చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. తర్వాత తమ బ్యాగుల నుంచి దుప్పట్లు తీసుకుని కప్పుకున్నారని విచారణలో తేలింది. ఇద్దరు ఉగ్రవాదులు లోయలో పరిస్థితులను గమనించేందుకు వాగు దగ్గరికి వెళ్లి అక్కడి కదలికలను పరిశీలించారు. అనంతరం ముగ్గురూ కలిసి చివరి దాడికి సిద్ధమయ్యారు.వారిలో ఒకరు తలకు గోప్రో కెమెరా ధరించినట్లు చార్జ్‌షీట్‌లో వెల్లడైంది. కంచె దాటి పార్కులోకి ప్రవేశించిన తర్వాత ఇద్దరు ప్రధాన ప్రవేశ ద్వారం వైపు, మరొకరు జిప్‌లైన్‌ ప్రాంతం వైపు వెళ్లారు.

Advertisement

వివరాలు 

మైదానాన్ని'కిల్ జోన్‌'గా మార్చారు: ఎన్‌ఐఏ 

మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాలకు ఒక ఉగ్రవాది ఎం-4 కార్బైన్‌తో తొలి కాల్పి జరిపాడు. వెంటనే మిగిలిన ఇద్దరు ఏకే-47లతో కాల్పులు ప్రారంభించారు.దక్షిణ దిశలో జిప్‌లైన్ ప్రాంతం, ఉత్తర దిశలో మెయిన్ గేట్ వద్ద నుంచి ఒకేసారి కాల్పులు జరిపి మధ్యలో ఉన్న మైదానాన్ని'కిల్ జోన్‌'గా మార్చారని ఎన్‌ఐఏ పేర్కొంది. ఎక్కువ మంది పౌరులు చనిపోయేలా ముందుగానే పక్కా ప్రణాళిక రచించినట్లు తెలిపింది.

వివరాలు 

ఉగ్ర లక్ష్యంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదు:ఎన్‌ఐఏ

దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయే క్రమంలో కంచె బయట చెట్ల వెనుక దాక్కున్న ముగ్గురు పౌరులను దగ్గర నుంచి కాల్చిచంపినట్లు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మరో వ్యక్తిని ఆపి 'కల్మా' చెప్పమని అడిగి, అతడు చెప్పడంతో వదిలేసినట్లు వెల్లడించింది. పార్కు బయటకు వెళ్లిన తర్వాత ఉగ్రవాదులు ఆనందంగా గాల్లోకి కాల్పులు జరిపారని, తమ ఉగ్ర లక్ష్యంపై ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఎన్‌ఐఏ పేర్కొంది.

Advertisement