Page Loader
AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్‌.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!
మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్‌.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!

AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్‌.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 17, 2025
05:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డీజీపీకి ఆయన వ్యక్తిగతంగా లేఖలు రాశారు. తన ఆరోపణల్లో మదన్ రెడ్డి వెల్లడించిన విషయాలు లిక్కర్ స్కాంలో కొత్త కోణాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. పది సంవత్సరాల పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేసిన మదన్ రెడ్డి.. ఇప్పుడు సిట్‌ పై తీవ్ర ఆరోపణలు చేశారు. లిక్కర్ కేసులో తాము చెప్పిన ప్రకారమే స్టేట్‌మెంట్ రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. తనకు ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్టే విన్నాడని సిట్ అధికారులు అన్నారని చెప్పారు.

Details

ఆరోపణలను కొట్టేసిన సిట్

విచారణకు యూనిఫాం లేకుండా వెళ్లినందుకు దూషించారని, తప్పుడు స్టేట్‌మెంట్ ఇవ్వకపోవడంతో తనపై దాడి చేశారని మదన్ రెడ్డి లేఖలో ఆరోపించారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలపై సిట్ స్పందించింది. మదన్ రెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదని ఖండించింది. లిక్కర్ స్కాంలో సిట్ పారదర్శకంగా వ్యవహరిస్తోందని తెలిపింది. ఇప్పటి వరకు 200 మందికి నోటీసులు జారీ చేసి విచారణ జరిపామని వెల్లడించింది. ఇంతవరకూ ఎవరూ ఇలాంటి ఆరోపణలు చేయలేదని స్పష్టం చేసింది. సిట్ ప్రకటన ప్రకారం, ఏ1 రాజ్ కేసిరెడ్డినుండి ముడుపులు చెవిరెడ్డికి చేరినట్టు తెలిసిందని, గత ఎన్నికల్లో ఆయన ప్రజలకు ఈ డబ్బులు పంచినట్టు సమాచారం ఉందని పేర్కొంది.

Details

మదన్ రెడ్డి విచారణకు సహకరించలేదు

ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి గన్‌మెన్‌గా పనిచేసిన మదన్ రెడ్డిని విచారణకు పిలిచామని, అయితే ఆయన సహకరించకుండా అధికారులపై ఆరోపణలు చేస్తూ బెదిరించారని తెలిపింది. ఇదే సమయంలో చెవిరెడ్డి సన్నిహితుడైన బాలాజీ యాదవ్‌ను సిట్ నిర్బంధించిందని హైకోర్టులో పిటిషన్ వేయడం, ఇప్పుడు మదన్ లేఖ బయటకు రావడం వెనుక కుట్ర ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిట్‌ను బలహీనపరిచి విచారణను ప్రభావితం చేసే ప్రయత్నమే జరుగుతోందని పేర్కొంది. సిట్ ఎవరి బెదిరింపులకూ లొంగదని, తప్పు చేసిన వారిని చట్టం ముందుకు తీసుకొస్తామని, మదన్ రెడ్డి ఆరోపణలు అవాస్తవమైనవైనా, వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించమని డీజీపీకి విజ్ఞప్తి చేస్తామని పేర్కొంది.