మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్
మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ ను ప్రయోగించి, వాటిని కూల్చివేయించింది. స్థానిక యంత్రాంగమే ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిందితులు రవీంద్ర కుమార్, అతుల్ భదోలియా సత్నాజిల్లాలోని ప్రముఖ ఆలయ ట్రస్టులో పనిచేస్తున్నారు. నిందితులు గురువారం ఓ బాలికను ఆత్యాచారం చేయడంతో పాటు శరీరమంతా పంటిగాట్లు చేసి రాక్షసంగా ప్రవర్తించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ప్రాణప్రాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.
నిందితులను విధుల నుంచి తప్పించిన ఆలయ ట్రస్టు
మైహర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ మున్సిపల్ అధికారి ఈ ఘటనపై శుక్రవారం నిందితుల కుటుంబాలకు నోటీసులు జారీ చేసి, నిందితుల ఇళ్లు, స్థలాల పత్రాలను పరిశీలించారు. భదోలియా ఉంటున్న ఇంటిని ప్రభుత్వ భూమిలో నిర్మించి, అనుమతి లేకుండా కట్టారని అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఇళ్లను బుల్డోజర్ తో కూల్చేశారు. ఈ నిందితుల తీరుతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగినందున వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆలయ ట్రస్టు పేర్కొంది. వైద్య నివేదిక వచ్చిన తర్వాతే అన్ని వివరాలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని ఎస్పీ అశుతోశ్ గుప్తా పేర్కొన్నారు.