Page Loader
Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు
మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2025
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ ఈ రోజు (జూన్ 9, ఆదివారం) ఉదయం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత మూడ్రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఒకింత స్థిరంగా కనిపించినప్పటికీ, అకస్మాత్తుగా మళ్లీ విషమించడంతో తేరుకోలేక మృతి చెందారు. ఆయన మరణ వార్తతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సహా పలువురు నాయకులు మాగంటి గోపినాథ్ మృతి పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మాగంటి గోపినాథ్‌కు సునీతతో వివాహమైంది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Details

విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి

1963 జూన్ 2న హైదరాబాద్‌లో జన్మించిన మాగంటి గోపినాథ్, కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతుల సంతానంగా వెలసారు. 1980లో వెంకటేశ్వర ట్యూటోరియల్స్‌ నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేయగా, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ప్రజాసేవపై ఆసక్తి ఉన్న గోపినాథ్, చదువు పూర్తయిన వెంటనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు.

Details

టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభం

1983లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరిన మాగంటి గోపినాథ్, 1985 నుంచి 1992 వరకూ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 1987, 1988లలో హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హూడా) డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే 1988 నుంచి 1993 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా సేవలందించారు. తర్వాత టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.

Details

తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపు.. పార్టీ మార్పు

2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మాగంటి గోపినాథ్, ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9,242 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Details

హ్యాట్రిక్ విజయాలతో నిలదొక్కుకున్న నేత

2018లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మరోసారి జూబ్లీహిల్స్‌ నుంచి బరిలోకి దిగిన గోపినాథ్, కాంగ్రెస్ అభ్యర్థి పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 16,004 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ శాసనసభ కాలంలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2022 జనవరిలో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. అధికార పార్టీకి కీలక నేతగా ఎదిగిన మాగంటి గోపినాథ్ అకాల మరణం తెలుగు రాజకీయ వర్గాలకు తీరని లోటుగా మారింది.