PM Modi: మహా కుంభమేళా విజయవంతం.. భక్తులకి మోదీ క్షమాపణతో సందేశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమాహారంగా పేరుగాంచిన మహా కుంభమేళా ఘనంగా ముగిసింది. 45 రోజుల పాటు సాగిన ఈ మహా ఉత్సవం విశేషాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన బ్లాగ్‌లో పంచుకున్నారు.
ఇంత భారీ స్థాయిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతటి సవాళ్లను ఎదుర్కొంటుందో ప్రస్తావించారు. ఏమైనా అసౌకర్యం కలిగి ఉంటే భక్తులు క్షమించాలంటూ అభ్యర్థించారు.
ఐక్యత కోసం నిర్వహించిన ఈ మహాయజ్ఞం విజయం సాధించిందని, భారతీయ సంస్కృతి ఐక్యతకు ఈ మహా కుంభమేళా నిదర్శనంగా నిలిచిందని మోదీ చెప్పారు.
అంచనాలను మించిపోయేలా కోట్లాది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చారని, నవ భారత నిర్మాణానికి ఇది సంకేతమని తెలిపారు.
Details
భక్తులు స్వచ్ఛదంగా రావడం అభినందనీయం
ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరే ఇతర కార్యక్రమంతో పోల్చలేమని, త్రివేణి సంగమం తీరం వైపు కోటికి పైగా భక్తులు ఎలా చేరుకున్నారో ప్రపంచం ఆశ్చర్యపోతోందన్నారు.
అధికారికంగా ఎటువంటి ఆహ్వానాలు పంపకపోయినా, పవిత్ర సంగమంలో స్నానం చేసేందుకు భక్తులు స్వచ్ఛందంగా తరలి రావడం అభినందనీయమన్నారు.
గంగా, యమునా, సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానం అనంతరం వారి ముఖాల్లో కనిపించిన ఆనందం, సంతృప్తి తానేప్పటికీ మర్చిపోలేనన్నారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎంతోమంది వ్యయప్రయాసలను మరిచి కుంభమేళాకు రావడం చూసి మక్కువ కలిగిందని మోదీ తన భావాలను వ్యక్తం చేశారు.
Details
ఫిబ్రవరి 5న కుంభమేళాకు విచ్చేసిన మోదీ
ఈ సందర్భంగా మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, ప్రయాగ్‌రాజ్ ప్రజలు, భక్తులకు మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తమ ప్రయత్నాల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలను ప్రార్థిస్తూ క్షమాపణ కోరుతున్నానని మోదీ అన్నారు.
ఫిబ్రవరి 10న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళాకు విచ్చేసి పవిత్ర నదుల్లో స్నానం చేశారు.