Maha Kumbh mela: ప్రారంభమైన మహా కుంభమేళా.. భక్తుల తాకిడితో కిటకిటలాడిన త్రివేణి సంగమం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా ఘనంగా ప్రారంభమైంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమ ప్రదేశానికి లక్షలాది భక్తులు తరలి వచ్చారు.
పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం తెల్లవారుజామునే భక్తులు త్రివేణి సంగమానికి చేరుకొని పవిత్ర స్నానాలు ప్రారంభించారు.
ఈ వేడుక 45 రోజుల పాటు కొనసాగనుంది. దేశం నలుమూలల, విదేశాల నుంచి భక్తులు, పర్యటకులు ఈ కుంభమేళాను సందర్శించనున్నారు.
యూపీ ప్రభుత్వం మొత్తం 35 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
Details
కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు
భక్తుల సౌకర్యం, భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. నదిలో భద్రతను పర్యవేక్షించడానికి ప్రత్యేక తేలియాడే పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేశారు.
భద్రతా సిబ్బంది చిన్న పడవలపై నిరంతరం పెట్రోలింగ్ చేస్తున్నారు.
కుంభమేళా కోసం 10,000 ఎకరాల్లో ఏర్పాట్లు జరిగాయి. ఏ సమయంలోనైనా 50 లక్షల నుంచి కోటి మంది వరకు భక్తులు ఉండగలిగేలా అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
భద్రత నిమిత్తం 55 పోలీస్‌స్టేషన్లను ఏర్పాటు చేసి, 45,000 మంది పోలీసులను మోహరించారు.
ఈ కుంభమేళాలో సాధువుల 13 అఖాడాలు కూడా పాల్గొననున్నాయని అధికారులు వెల్లడించారు.