TSRTC : నేటి నుంచే మహిళామణులకు జీరో టికెట్లు జారీ.. గుర్తింపుకార్డులు తప్పనిసరి
తెలంగాణలో నేటి నుంచి మహిళలకు బస్సుల్లో జీరో టికెట్లు జారీ చేయనున్నారు. ఈ మేరకు గుర్తింపు కార్డులు తప్పనిసరి అని సర్కార్ ప్రకటించింది. మహాలక్ష్మీ పథకం అమలుకు సాఫ్ట్ వేర్ అప్'డేట్ చేశామన్నారు. మహిళ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ప్రతి మహిళా ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్'ను తీసుకుని సంస్థకు సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ఈ మేరకు మహిళలకు జీరో టిక్కెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో గురువారం సాయంత్రం ఎండీ సజ్జనార్ వర్చువల్'గా సమావేశమయ్యారు.
స్థానికత చూపించి జీరో టికెట్ పొందాలి : ఆర్టీసీ ఎండీ సజ్జనార్
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు సాఫ్ట్'వేర్ అప్'డేట్ చేశామని, ఈ మేరకు టిమ్ మిషన్'లో ఇన్'స్టాల్ చేశామన్నారు. వాటి ద్వారానే నేటి నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుందన్నారు. ఈ క్రమంలోనే మహిళా ప్రయాణికులు ఆధార్, ఓటర్ లాంటి గుర్తింపు కార్డులను వెంట తెచ్చుకోవాలన్నారు. స్థానికత, ధృవీకరణ కోసం వాటిని బస్ కండక్టర్లకు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారన్నారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని మహిళలు, బాలికలు, విద్యార్థులు, థర్డ్ జెండర్స్ ఉపయోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. డిసెంబర్ 9 మధ్యాహ్నం నుంచి మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలులోకి తీసుకురావడం గమనార్హం.