Maharashtra: భివండిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో విషాదఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఇంకా మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్), రాష్ట్ర విపత్తు స్పందన దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలు శిథిలాలను తొలగిస్తూ గాలింపు చేపట్టాయి. అధికారుల వివరాల ప్రకారం, బుధవారం అర్ధరాత్రి సమయంలో భవనం ఒకవైపు ప్రమాదకరంగా ఒరిగినట్లు గుర్తించారు. పరిస్థితిని గమనించిన కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో మరింత ప్రాణనష్టం తప్పినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో మరమ్మతు పనులు కొనసాగుతున్నట్లు సమాచారం.
వివరాలు
ఓ మహిళను సజీవంగా రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్
శిథిలాల కింద నుంచి ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీయగా,మరో మహిళను సజీవంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
ఈ ప్రమాదం నుంచి బయటపడిన దీపక్ కుమార్ యాదవ్ తన అనుభవాన్ని వివరిస్తూ.. భోజనం చేసి నిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందన్నారు.
వెంటనే బయటకు వచ్చి చూడగా భవనం కూలిపోతుండటాన్ని గమనించినట్లు చెప్పారు.
ప్రాణాలు కాపాడుకోవడానికి మొదటి అంతస్తు నుంచి దూకి బయటపడినట్లు తెలిపారు.
మరో బాధితుడు అభయ్ కుమార్ యాదవ్ కూడా మొదటి అంతస్తు నుంచి దూకి తప్పించుకున్నప్పటికీ, ఈ ఘటనలో అతడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాలు
భవనంలో మొత్తం సుమారు 45 గదులు
స్థానికురాలు నేహా సింగ్ మాట్లాడుతూ.. తన భర్త రంజిత్ సింగ్ కిందికి వెళ్లిన పది నిమిషాల వ్యవధిలోనే భవనం కూలిపోయిందని తెలిపారు.
అప్పటి నుంచి ఆయన ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
భవనంలో మొత్తం సుమారు 45 గదులు ఉండగా, ప్రమాదం జరిగిన సమయంలో 25 నుంచి 30 మంది వరకు అక్కడ ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
భారీగా పేరుకుపోయిన శిథిలాల కారణంగా సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయని, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.