
Maratha Reservation: 10% మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర కేబినెట్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
మరాఠా సామాజిక వర్గానికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మహారాష్ట్ర (Maharashtra) ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
షిండే (శివసేన)-బీజేపీ, ఎన్సీపీ (అజిత్ గ్రూపు)ల సంకీర్ణ ప్రభుత్వ కేబినెట్ మంగళవారం ఉదయం మరాఠా రిజర్వేషన్ (Maratha Reservation) బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లపై ప్రభావం పడకుండా మరాఠాలకు కోటా కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మరాఠా సామాజిక వర్గం చాలా కాలంగా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తోంది. మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒకరోజు ప్రత్యేక శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
సాయంత్రంలోగా ఈ బిల్లును అసెంబ్లీ కూడా ఆమోదించే అవకాశం ఉంది.
మహారాష్ట్ర
బిల్లుకు ఎమ్మెల్యేలందరూ మద్దతు ఇవ్వాలి: మనోజ్ జరంగే పాటిల్
గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలికేందుకు షిండే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రిజర్వేషన్ బిల్లుకు ఏకగ్రీవంగా మద్దతు ఇవ్వాలని మరాఠా ఎమ్మెల్యేలందరికీ మరాఠా రిజర్వేషన్ ఉద్యమకారుడు మనోజ్ జరంగే పాటిల్ విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం మరాఠాలకు కుంబీ కుల ధృవీకరణ పత్రం జారీ చేయాలని మరాఠా రిజర్వేషన్లు డిమాండ్ చేస్తున్న మనోజ్ జరంగే డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్యానికి ముందు, మరాఠ్వాడా ప్రాంతం హైదరాబాద్ రాచరిక రాష్ట్రంలో భాగంగా ఉండేదని, 1948 సెప్టెంబర్‌లో నిజాం పాలన ముగిసే వరకు మరాఠాలను కుంబీ కులంగా పరిగణించేవారని, ఆ తర్వాత వారు ఓబీసీ కులం కిందకు వచ్చారని మనోజ్ జరంగే చెప్పారు. కాబట్టి మరాఠాలను కుంబీ కులంలో చేర్చాలని డిమాండ్ చేశారు.