Maharastra: మహారాష్ట్రలో ఎస్సై లైంగిక వేధింపులతో మహిళా డాక్టర్ ఆత్మహత్య.. అరచేతిపై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి నుంచే తీవ్రమైన లైంగిక వేధింపులు ఎదురైన ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన చేతిపై సూసైడ్ నోట్ రాసి, తన చావుకు కారణమైన ఎస్సై (సబ్-ఇన్స్పెక్టర్) పేరును వెల్లడించారు. సతారా జిల్లా ఆసుపత్రిలో గురువారం రాత్రి ఈ విషాదం జరిగింది. ఈ ఘటన మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది.
వివరాలు
ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపణ
వివరాల్లోకి వెళితే, ఫల్టాన్ సబ్-డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా పని చేస్తున్న మహిళా డాక్టర్‌పై పోలీస్ సబ్-ఇన్స్పెక్టర్ గోపాల్ బద్నే ఐదు నెలలుగా లైంగిక వేధింపులు కొనసాగించాడని ఆమె వెల్లడించారు. తనపై నాలుగుసార్లు అత్యాచారం చేసినట్లు, శారీరక, మానసికంగా తీవ్రంగా వేధించినట్లు ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. "నా చావుకు గోపాల్ బద్నే కారణం. అతడు నాపై నాలుగుసార్లు అత్యాచారం చేశాడు" అని ఆమె స్పష్టంగా రాసుకున్నారు. అదనంగా, మరో పోలీస్ అధికారి ప్రశాంత్ బంకర్ కూడా మానసికంగా వేధించాడని ఆమె నోట్‌లో వెల్లడించారు.
వివరాలు
జూన్‌లోనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
ఆయితే, ఈ వేధింపులపై బాధితురాలు ఈ ఏడాది జూన్ 19న ఫల్టాన్ డీఎస్పీకి లిఖితపూర్వక ఫిర్యాదు చేసారు. ఎస్సై బద్నేతో పాటు ఇద్దరు ఇతర పోలీస్ అధికారుల పేర్లను ఆమె లేఖలో పేర్కొని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ, అప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. ఈ ఆత్మహత్య అనంతరం, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఆదేశాల మేరకు నిందిత ఎస్సై గోపాల్ బద్నేను సస్పెండ్ చేశారు.
వివరాలు
ప్రభుత్వంపై విపక్షాల తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారం
ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. "రక్షకులు భక్షకులవైతే, న్యాయం ఎలా జరుగుతుంది? పోలీస్‌లు ఒక మహిళా డాక్టర్‌ను వేధిస్తుంటే ఎలాంటి న్యాయం ఆశించాలి? ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు?" అని కాంగ్రెస్ నేత విజయ్ వడెట్టివార్ ప్రశ్నించారు. నిందితులపై కేవలం విచారణ కాకుండా, వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై అధికార పక్షం కూడా స్పందించింది. బీజేపీ నాయకురాలు చిత్ర వాఘ్ ఈ ఘటన దురదృష్టకరమని, దీని పై పూర్తి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వివరాలు
ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన మహారాష్ట్ర మహిళా కమిషన్
మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో 112 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆమె కోరారు. ఎన్సీపీ నేత ఆనంద్ పరంజపే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించింది. గత ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో పరిశీలించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సతారా ఎస్పీకి ఆదేశించింది. ప్రస్తుతానికి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు వెతుకుతున్నారు.