AP Intermediate Exams 2027-28: ఏపీ ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు.. బట్టీ పట్టే ప్రశ్నలకు చెక్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రాల విధానంలో కీలక మార్పులు తీసుకురావడానికి ఇంటర్మీడియట్ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పరఖ్ (PARAKH) నిబంధనలకు అనుగుణంగా ప్రశ్నపత్రాల రూపకల్పనలో మార్పులు చేయాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా పాఠశాల విద్యలో పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల తయారీ, విద్యార్థుల సామర్థ్యాల అంచనా విధానాల్లో ఏకరూపత తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇప్పటికే పరఖ్ నిబంధనలపై ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులకు ఎన్‌సీఈఆర్టీ కార్యశాలను నిర్వహించింది. ఇప్పటివరకు విద్యార్థులు పాఠ్యాంశాలను కంఠస్థం చేసి, పరీక్షల్లో సమాధానాలు రాసే విధానానికి ఇకపై స్వస్తి పలకాలని బోర్డు భావిస్తోంది.
వివరాలు
సృజనాత్మక ఆలోచనలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలు
కేవలం జ్ఞాపకశక్తిని కాకుండా విద్యార్థుల విషయ పరిజ్ఞానం, అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మక ఆలోచనలను పరీక్షించేలా ప్రశ్నపత్రాలను రూపొందించనుంది.
పాఠ్యాంశాల్లోని అంశాల నుంచి నేరుగా ప్రశ్నలు అడగకుండా.. విద్యార్థుల్లో విశ్లేషణాత్మక ఆలోచనను పెంపొందించే విధంగా ప్రశ్నల స్వరూపాన్ని మార్చనుంది.
ముఖ్యంగా విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా శక్తిని పరీక్షించేలా 10శాతం ప్రశ్నలను రూపొందించనుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివర ప్రశ్నలు ఇస్తున్నారు.
పబ్లిక్ పరీక్షల్లోనూ ప్రధానంగా వీటిలో నుంచే ప్రశ్నలు అడుగుతున్నారు. దీంతో విద్యార్థుల సృజనాత్మకత, స్వతంత్ర ఆలోచనా సామర్థ్యాలను పరీక్షించే ప్రశ్నలకు తగిన ప్రాధాన్యం లభించడం లేదు.
ఈ నేపథ్యంలో కొత్త విధానానికి అనుగుణంగా ప్రశ్నలను రూపొందించేందుకు ఇప్పటికే సబ్జెక్టు నిపుణుల నుంచి ప్రశ్నలను ఆహ్వానించారు.
వివరాలు
విద్యార్థుల అవగాహన, సామర్థ్యాలకు ప్రాధాన్యం
బోర్డు సమావేశంలో వీటికి ఆమోదం లభించిన తర్వాత వచ్చే విద్యా సంవత్సరంలో ముద్రించే పాఠ్యపుస్తకాల్లో కొత్త ప్రశ్నలను చేర్చనున్నారు.
విద్యార్థులు పాఠ్యపుస్తకాల్లోని సమాధానాలను యథాతథంగా గుర్తుంచుకుని రాసే విధానానికి బదులుగా.. ప్రతి అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, సొంతంగా ఆలోచించి, విశ్లేషించి సమాధానాలు రాసేలా ప్రశ్నలను రూపొందించనున్నారు.
ఈ కొత్త విధానానికి అనుగుణంగా బోధనలోనూ మార్పులు తీసుకురానున్నారు. ఇందుకోసం అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
సమష్టిగా పనిచేసే నైపుణ్యాలు
ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఇతరులతో కలిసి పనిచేయడం, బాధ్యతలను పంచుకోవడం, భిన్నమైన ఆలోచనలను గౌరవించడం, సమష్టిగా సమస్యలను పరిష్కరించడం వంటి నైపుణ్యాలను ప్రశ్నల ద్వారా అంచనా వేస్తారు.
వివరాలు
సృజనాత్మక ఆలోచనలు
విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు చేయడం, వినూత్న పరిష్కారాలను కనుగొనడం, ఒక సమస్యను విభిన్న కోణాల్లో పరిశీలించే సామర్థ్యాలకు సృజనాత్మకత విభాగంలో ప్రాధాన్యం కల్పిస్తారు.
జాతీయ విద్యా విధానం-2020 లక్ష్యాలకు అనుగుణంగా పరీక్షల స్వరూపాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇందులో భాగంగా ఎన్‌సీఈఆర్టీ పరిధిలో ఏర్పాటు చేసిన జాతీయ మూల్యాంకన కేంద్రం పరఖ్ (PARAKH) ద్వారా దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ, మూల్యాంకన విధానాల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఈ మార్పుల్లో భాగంగానే రాష్ట్రంలోనూ 2027-28 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాల విధానాన్ని మార్చేందుకు కసరత్తు జరుగుతోంది.