
Fire Accident: తిరుపతి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టేషన్‌కు సమీపంలో నిలిపివున్న హిసార్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు మొదలయ్యాయి. మంటలు ఒక్కసారిగా విపరీతంగా వ్యాపించడంతో రైలు బోగీల్లో ఒకటి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాద సమయంలో, సమాంతర ట్రాక్‌పై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తుండగా, సిబ్బంది అప్రమత్తంగా స్పందించడంతో సకాలంలో ఆ రైలును ఆపేశారు. దీనివల్ల మరో భారీ ప్రమాదం తప్పింది. మంటలు వేరే బోగీలకు అంటుకునేలోపే, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Details
ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్న పోలీసులు
అప్పటికే ప్రమాదం జరిగిన సమయంలో హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలును గ్యారేజ్ వైపు తరలిస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే రైల్వే పోలీసులు, ఉన్నతాధికారులు, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలను రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కనే ఉన్న వందే భారత్ రైలు ప్రమాదం నుంచి తప్పించుకోవడం అంతా సిబ్బంది చాకచక్యమేనని రైల్వే వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో రైళ్లు నిలిపివేసినట్లు సమాచారం.