AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపిన ఈడీ అధికారులు.. తాజాగా మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మద్యం కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కారుమూరి సునీల్‌ను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఇటీవల హైదరాబాద్‌లోని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని పరిశీలించిన విషయం తెలిసిందే.
వివరాలు
ఇప్పటికే రాజ్ కేశిరెడ్డి అరెస్టు
ఇదే కేసులో కీలక సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేశిరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈడీ.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు కారుమూరి సునీల్ అరెస్టుతో కేసు దర్యాప్తు మరింత కీలక మలుపు తిరిగింది. మద్యం రవాణా టెండర్ల కేటాయింపులు, నిధుల మళ్లింపు వ్యవహారాల్లో కారుమూరి సునీల్ కీలక పాత్ర పోషించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు ఆయనపై విచారణ చేపట్టి అరెస్ట్ చేసినట్లు సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌బీసీఎల్) ద్వారా జరిగిన రూ.195 కోట్ల మద్యం రవాణా కుంభకోణంలో సునీల్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు తెలుస్తోంది.
వివరాలు
మద్యం సిండికేట్‌కు, స్థానిక కాంట్రాక్టర్లకు అనుసంధానకర్తగా ఉన్నారు
ఈ వ్యవహారంలో మద్యం సిండికేట్‌కు, స్థానిక కాంట్రాక్టర్లకు మధ్య అనుసంధానకర్తగా పనిచేశారనే ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయి. తన తండ్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఉన్న రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి మద్యం రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్టులను దక్కించుకున్నారని ఈడీ అనుమానిస్తోంది. హైదరాబాద్‌లో అరెస్టు చేసిన కారుమూరి సునీల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లిలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. తదుపరి విచారణ కోసం ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.