Maldives Flight Bookings: మాల్దీవులకు మళ్లీ ఫ్లైట్ బుకింగ్స్ ప్రారంభం
జనవరిలో జరిగిన దౌత్య వివాదం నేపథ్యంలో ఈజ్ మై ట్రిప్ తన ప్లాట్‌ఫారమ్‌లో మాల్దీవుల ఫ్లైట్ బుకింగ్స్‌ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. మాల్దీవుల మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఈ వివాదానికి దారితీసింది. మాల్దీవుల మంత్రుల విమర్శలకు భారతదేశం వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈజ్ మై ట్రిప్, మాల్దీవులకు విమాన బుకింగ్‌లు నిలిపివేసి నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతున్న తరుణంలో ఈజ్ మై ట్రిప్ మళ్లీ బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈఓ నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
మంత్రుల వ్యాఖ్యలపై భారత్ లో తీవ్ర నిరసనలు
భారత్-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూలంగా మారుతున్నాయని, ఈ పరిణామాల నేపథ్యంలో మాల్దీవుల బుకింగ్స్ మళ్లీ ప్రారంభిస్తున్నామని పిట్టి తెలిపారు. భారత ప్రభుత్వ ధ్యేయాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామన్న ఆయన, ఈ చర్య ద్వైపాక్షిక స్నేహబంధాన్ని, పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. 2023 జనవరిలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన చేసిన సమయంలో, మాల్దీవుల మంత్రులు భారతదేశం పర్యాటక రంగంపై, ముఖ్యంగా బీచ్ టూరిజం విషయంలో భారత్ పోటీ పడలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఉండటంతో, భారత్‌లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు స్పందించి, ఆ మంత్రులను పదవీ బాధ్యతల నుంచి తొలగించారు.
భారత్ పర్యటనలో మల్దీవుల అధ్యక్షుడు
మంత్రుల వ్యాఖ్యలతో ఈజ్ మై ట్రిప్ స్పందించి, మాల్దీవుల విమాన బుకింగ్‌లను నిలిపివేసింది. భారత పర్యాటకులు మాల్దీవుల పర్యాటక రంగానికి ముఖ్యమైన వారని, ఈ నిర్ణయంతో ఆ దేశం ఆర్థికంగా నష్టపోయింది. మాల్దీవుల ట్రావెల్ ఆపరేటర్లు భారత పర్యాటకుల రాక తగ్గడం వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజు, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి అక్టోబర్ 6 నుండి 10 వరకు భారత పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని మోదీతో సమావేశమై, వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై చర్చలు జరుపుతున్నారు. ఇక మాల్దీవులకు తిరిగి ఇండియన్ పర్యాటకులు వెళ్తారా అనేది ఇంకా ప్రశ్నార్థకమే.