Supreme Court: చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే షాక్.. మాల్స్, హాస్పిటళ్లకు కరెంట్, నీళ్లు కట్!
ఈ వార్తాకథనం ఏంటి
చెత్త నిర్వహణ నిబంధనలు పాటించని పెద్ద సంస్థలు, వాణిజ్య సముదాయాలపై సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది. ముఖ్యంగా మాల్స్, పెద్ద ఆసుపత్రులు, హోటళ్లు, విద్యాసంస్థలు వంటి భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM)రూల్స్ 2026ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. నిబంధనలు అమలు చేయకపోతే ఆయా సంస్థలకు విద్యుత్,నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలిపింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి,జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2026ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. చెత్త ఉత్పత్తి రోజురోజుకూ భారీగా పెరుగుతున్నా.. దాని నిర్వహణ, వేరు చేయడం,సరైన విధంగా పారవేయడంలో ప్రజల్లో తగినంత అవగాహన,బాధ్యత కనిపించడం లేదని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలను 6 వారాల్లో గుర్తించాలి
చెత్త నిర్వహణకు సంబంధించిన మౌలిక సదుపాయాలను పూర్తిగా పరిశీలించి, కొత్త నిబంధనలకు అనుగుణంగా వాటిని మెరుగుపరచాలని సూచించింది.
సమాజంలో నెలకొన్న తీరుపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.
చెత్తను ఉత్పత్తి చేసే హక్కు తమకు ఉందని భావిస్తున్నా.. దాని ప్రభావాన్ని తగ్గించేందుకు సహకరించాలనే బాధ్యతను మాత్రం పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించింది.
బయోడిగ్రేడబుల్, నాన్-బయోడిగ్రేడబుల్, ప్రమాదకర చెత్త ఇలా వివిధ రకాల వ్యర్థాలు భారీగా పెరిగిపోయాయని.. వీటన్నింటినీ ఒకే వర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు నిర్వహించాలని ఆశించడం సరికాదని పేర్కొంది.
భారీగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలను గుర్తించే ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సుప్రీంకోర్టు ఆదేశించింది.
వివరాలు
చెత్త నిబంధనల అమలుపై సుప్రీంకోర్టు విచారణ
స్థానిక సంస్థల సహకారంతో బల్క్ వేస్ట్ జనరేటర్లను (BWGs) గుర్తించాలని సూచించింది.
నిబంధనలు పాటించని సంస్థలకు ముందుగానే వాటి వల్ల ఎదురయ్యే పరిణామాలను తెలియజేయాలని ఆదేశించింది.
అవసరమైతే నిబంధనలు అమలు చేసే వరకు విద్యుత్, నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని స్పష్టం చేసింది.
మున్సిపల్ సంస్థలు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయన్న అంశంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది.
భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ తన పరిధిలో మున్సిపల్ చెత్త నిర్వహణకు సంబంధించిన బాధ్యతలపై సాగుతున్న చర్యలను సవాల్ చేసింది.
వివరాలు
SWM రూల్స్‌పై దేశవ్యాప్తంగా కఠిన అమలుకు సుప్రీంకోర్టు ఆదేశం
సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ కేసు పరిధిని దేశవ్యాప్తంగా విస్తరించిన సుప్రీంకోర్టు.. పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, చదువుకున్న వారు, చదువుకోని వారు, ఉద్యోగులు, నిరుద్యోగులు సహా వ్యక్తులు, సంస్థలు నిబంధనలు పాటించడంపై దృష్టి పెట్టింది.
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన SWM రూల్స్ 2026ను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన కమిటీలను ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు ప్రశంసించింది.
అయితే కేవలం కమిటీలు, అమలు సంస్థలను ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని పేర్కొంది.
నిబంధనలు పాటించకపోవడం వల్ల ఏర్పడే పర్యావరణ, ప్రజారోగ్య ముప్పులను అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు అవసరమని స్పష్టం చేసింది.
వివరాలు
చెత్త రూల్స్ ఉల్లంఘిస్తే కరెంట్, నీళ్లు బంద్.. కలెక్టర్లకు కీలక అధికారాలు
పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 కింద జిల్లా కలెక్టర్లకు మరిన్ని అధికారాలు కల్పించాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.
తద్వారా చెత్త నిర్వహణ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కలెక్టర్లు శిక్షాత్మక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే ప్రతి జిల్లాలో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
వీటిలో కాలుష్య నియంత్రణ మండళ్ల ప్రాంతీయ అధికారులు సభ్యులుగా ఉండాలి.
వివరాలు
చెత్త రూల్స్ ఉల్లంఘిస్తే కరెంట్, నీళ్లు బంద్.. కలెక్టర్లకు కీలక అధికారాలు
నిబంధనలు ఉల్లంఘించే బల్క్ వేస్ట్ జనరేటర్ల విద్యుత్, నీటి కనెక్షన్లను నిలిపివేసే అధికారం ఈ ప్రత్యేక విభాగాలకు ఉంటుంది.
రోజుకు 100 కిలోలకుపైగా చెత్త ఉత్పత్తి చేసే సంస్థలు లేదా 20,000 చదరపు మీటర్లకు పైగా నిర్మిత విస్తీర్ణం కలిగిన సంస్థలను బల్క్ వేస్ట్ జనరేటర్లుగా పరిగణిస్తారు.
అలాగే రోజుకు 40 వేల లీటర్లకుపైగా నీటిని వినియోగించే పెద్ద హోటళ్లు, మాల్స్, ఆసుపత్రులు తదితర సంస్థలు కూడా ఈ పరిధిలోకి వస్తాయి.